ముంబై : తాను పార్టీలో కీలక బాధ్యతలు తీసుకుంటాను కానీ ప్రతిపక్ష నేత బాధ్యతలపై ఆసక్తి లేదని ఎన్‌సిపి సీనియర్ నేత అజిత్ పవార్ తెలిపారు. తనను అసెంబ్లీలో ప్రతిపక్ష నేత బాధ్యతల నుంచి తప్పించాలని బుధవారం ఆయన పార్టీ అధినాయకత్వనికి విజ్ఞప్తి చేశారు. పార్టీలో ఫలానా అని కాకుండా ఏ బాధ్యతలు అయినా అప్పగించినా స్వీకరిస్తానని వెల్లడించారు.
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) 24వ వ్యవస్థాపక దినోత్సవం ముంబైలో బుధవారం జరిగిన సందర్భంగా అజిత్ పవార్ తన మనసులోని మాట వెలుగులోకి తీకువచ్చారు. ప్రతిపక్ష నేతగా తాను సభలో ఉండాల్సినంత కఠినంగా ఉండరని ప్రచారం జరుగుతోందని ఆయన తెలిపారు. తనను ఈ బాధ్యతల నుంచి తప్పించాలని పవార్ కోరడం పలు ఇతర రకాల ఊహాగానాలకు దారితీసింది.
తనకు ఇష్టం లేకపోయినా పార్టీ ఎమ్మెల్యేల కోరిక మేరకు ఇంతవరకూ ఈ బాధ్యతలో ఉన్నానని వివరించారు. తనకు నచ్చిందేమిటీ? నచ్చనిది ఏమిటనేది తెలిపానని , ఇక నిర్ణయం తీసుకోవల్సింది పార్టీయే, అధినాయకత్వమే అని స్పష్టం చేశారు. ఎన్‌సిపిలో ప్రధాన బాధ్యతలను సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్‌కు అప్పగిస్తూ ఇటీవలే పార్టీ అధినేత శరద్ పవార్ కీలక నిర్ణయం తీసుకున్న తరువాతి క్రమంలో అజిత్ పవార్ అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ దశలో ఆయన ఈ ప్రకటన పార్టీలో ప్రకంపనలకు దారితీసింది.