పురాణాల్లో త్రేతాయుగం, ద్వాపరయుగం అనే పదాలు కనబడతాయి. చరిత్రలో స్వర్ణయుగం అని రాజరిక పాలన కీర్తింపబడుతుంది. గత శతాబ్దం లో విప్లవం అనే మరో యుగం మొదలైంది. పాలక వ్యవస్థలపై సామాన్యులు సాయుధులై చేసే తిరుగుబాటు అది. ఆ ఊపుకు కొన్ని దేశాల్లో ప్రజాకంటక పాలనలు నేలమట్టమయ్యాయి. వాటి ప్రభావంతో చాల దేశాల్లో వర్గరహిత సమాజంపై ఆశలు మొలకెత్తాయి. మార్క్, లెనిన్, మావో అంటూ ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామిక మేధావులు శివాలెత్తారు. దాని ధాటికి సామాజిక, ఆర్థిక, రాజనీతి శాస్త్రాల్లో కొత్త అధ్యాయాలు తెరుచుకున్నాయి. సాహిత్యం ఎర్రబారింది. ఆ గాలి మన దాకా వచ్చింది.
నక్సల్బరీలో మొదలై శ్రీకాకుళం మీదుగా జగిత్యాల, సిరిసిల్లా.. ఇలా తెలుగు నేలను ఊపేసింది. ‘విప్లవాల యుగం మనది.. విప్లవిస్తే జయం మనది’ అనే విశ్వాసాన్ని పెంచింది. ఇక ఆగేదిలేదన్నట్లు సుడిగాలిలా విస్తరించింది. ఎమర్జెన్సీ తర్వాత 1977 నుండి కనీసం ఇరవై ఏళ్ల పాటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఈ విప్లవ యుగ ప్రభావం, విప్లవిస్తే వచ్చే జయాల ఫలితాలు కళ్లారా జనం చూశారు. ఊరూరా వెలసిన రైతు కూలి సంఘాలకు ప్రజల మద్దతు దొరికింది. వెట్టిచాకిరి, తక్కువ కూలీరేట్లు, ఆడవారిపై అత్యాచారాలు లాంటి దొరతనం ఆగడాల్ని తరాలుగా భరిస్తున్న గ్రామీణులకు పెద్ద ఊరట లభించింది. మీసం మెలేసే ఊరు పెద్దల, దొరలకు వత్తాసు పలికే గ్రామాధికారుల మాటలకు విలువ లేకుండా పోయింది.
ఏమంటే ఏమవుతుందో అనే భయం పల్లె పెత్తనాన్ని వణికించింది. ఒక దశలో ఉత్తర తెలంగాణ అంతటా అనగా కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాదు జిల్లాల్లో పాలన ప్రభుత్వాల చేతుల్లో లేకుండా పోయింది. కొన్ని సందర్భాల్లో నక్సలైట్ల డిమాండ్ల మేరకు ప్రభుత్వాలు దిగి రావలసి వచ్చేది. జనంలో వారికున్న గౌరవాన్నిగుర్తిస్తూ నక్సలైట్లే నిజమైన దేశభక్తులు అని నినాదంతో వచ్చిన ఎన్.టి.రామారావు 1983 లో ముఖ్యమంత్రి కాగలిగారు. గద్దెనెక్కాక ధిక్కారమును సైతునా అన్నట్లు ఆయనే నక్సలైట్లపై పోలీసుల ఎన్ కౌంటర్లకు సిద్ధపడ్డారు. రెచ్చిపోయిన పోలీసులు ఎడాపెడా తూటా లు పేల్చి ఇరువైపులా ప్రాణాలు బలి అయ్యేలా పరిస్థితి తెచ్చారు.
ఆ తర్వాత 1989 ముఖ్యమంత్రిగా వచ్చిన మర్రి చెన్నారెడ్డి నక్సలైట్లకు బహిరంగ స్వేచ్ఛనిచ్చారు. తిరిగి 1995 నుండి చంద్రబాబు పాలనలో నక్సలైట్లు తీవ్రంగా అణచివేయబడ్డారు. తట్టుకోలేని నక్సలైట్లు 2003లో ఆయనపై హత్య ప్రయత్నం చేశారు. తృటిలో తప్పించుకున్న చంద్రబాబు ఆ సానుభూతిని ఓట్లగా మలుచుకోవాలని అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. మళ్ళీ తెలుగు దేశం అధికారంలోకి రావద్దని సంకల్పించిన నక్సలైట్లు 2004 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు గ్రామీణ ఓట్లు పడకుండా చూశారు. అప్పటికే తన పాదయాత్రతో ప్రజలకు చేరువైన వైఎస్‌ఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను తిరిగి సాధించారు. ఆయన పాలనలో ఎన్నికల హామీ మేరకు నక్సలైట్లతో సాగి ఆగిన చర్చలు ఒక పార్శ్యమైతే, పోలీసు అధికారి స్వరణ్ జిత్ సేన్ నేతృత్వంలో నక్సలైట్లపై ఉక్కుపాదం మరో పార్శ్య మనుకోవాలి.
అయితే వైఎస్ పాలనలో మొదలైన కొత్త సంక్షేమ పథకాల వల్లనో లేదా మారిన కాల పరిస్థితుల వల్లనో గాని పల్లె ప్రజలు, పట్టణ యువత నక్సలైట్ల వెంట సాగడం తగ్గించారు. ఇంగ్లీషు, ఇంజనీరింగ్ చదువులతో విద్యార్థులు సామాజిక అవగాహనకు దూరమయ్యారు. వివిధ కారణాలుగా విప్లవ పార్టీలో చేరికలు మూసుకున్నాయి. 80 వ దశకంలో పార్టీలో చేరిన అప్పటి యువకులు ఇప్పుడు వయసు అరవై దాటే ఉంటారు. అడవి బతుకు, సహకరించని వయసు, తీవ్రమైన శారీరక శ్రమ, సమయానికి దొరకని తిండి, చికిత్స అందని అనారోగ్యాల వల్ల కొందరు లొంగిపోతారు. మరి కొందరు మృత్యువాతపడ్డారు. పోలీసులకు చిక్కిన వారు థర్డ్ డిగ్రీ పాలై మృత కళేబర శకలాలుగా అయినవారికి ఆఖరి చూపుగా ముగిసిపోయారు. చావో రేవో అక్కడే అనుకొని విప్లవబాటలో సాగుతున్న మిగిలిన కొద్ది మంది తుపాకిని అందుకొనే కొత్తవారు లేక తామే భుజం మార్చుకుంటూ కాలానికి ఎదురీదుతున్నారు.
ఒక్కొక్కరి తలకు లక్షలాది రూపాయల బహుమతిని ప్రకటించి ప్రభుత్వాలు వెంటాడుతూనే ఉన్నాయి. వీరందరి యుక్త వయసు ఎంతో ప్రాధాన్యత గలది. ఎక్కడో పుట్టిన సిద్ధాంతాలకు రక్తం మరిగి బతుకును బలీయడానికి సిద్ధపడ్డారు. ఎక్కడి మార్క్, ఎక్కడి మల్లోజుల. ఎక్కడి మావో, ఎక్కడి మారోజు. పేదల కష్టాలు చూడలేక కాలం కన్నా పోరు బిడ్డలు వీరు. స్వాతంత్య్రానికి ముందు, వెనుక ఎరుగని స్వేచ్ఛను, చూడని బతుకు ధీమాను గ్రామీణ ప్రజలకు వీరి ఉద్యమం అందించింది. పల్లె ప్రజల జీవితాలు ఇంతేలే అని పట్టించుకోని ప్రభుత్వాలు గ్రామాల గాలిలో వేడిని తగ్గించడానికి సంక్షేమ పథకాలను తెచ్చాయి. ఒక పరిమిత కాలానికైనా విప్లవాల యుగం మెరిసి విప్లవించిన మేరకు జయాల్ని తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ విజయాల వెనుక ఎందరో సాహసికుల ధీరత్వం, త్యాగ గుణం ఉంది.
వారిలో ముందు వరుస నాయకుడుగా నిలిచిన కటకం సుదర్శన్ 31 మే నాడు అనారోగ్యంతో అడవిలోనే ప్రాణాలు విడిచారు. ఆయన నిషేధిత మావోయిస్టు పార్టీ అగ్రనేత. అయినా సుదర్శన్ విప్లవ జీవితం త్యాగాల పోరుబాటగా మీడియాలో కీర్తింపబడుతోంది. పత్రికల్లో వ్యాస పరంపరగా ఆయన మరణం ఘనమైన నివాళులు అందుకుంటోంది. కలిగినవారికి ఆయన కరుడు కట్టిన తీవ్రవాది. ప్రభుత్వం లెక్కల్లో చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న చేతికందని నేరస్థుడు. పోలీసుల రికార్డుల్లో తమ సహచరులను పొట్టనపెట్టుకున్న క్రూరుడు. అయినా సుదర్శన్ మరణ వార్తపై సామాజిక మాధ్యమాల్లో నిర్భీతిగా అభిమానుల నివాళి కెరటాలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 40 ఏళ్ల అజ్ఞాత వాసంతో విప్లవోద్యమానికి మార్గదర్శనం చేసి నిండు జీవితాన్నిపేద ప్రజల కోసం త్యాగం చేసినవాడిలా గుర్తింపబడుతున్నారు.
ఆయన స్మృతిలో ‘విముక్తినే కలగన్న వీరోచితయోధుడవు / ఆశయాల కొలువులో పదునెక్కిన మానవుడవు’ అని కీర్తిస్తూ జోహార్లు అంటూ కవిత్వం వస్తోంది. ప్రభుత్వం ప్రకారం కటకం సుదర్శన్ ఒక తీవ్రవాద సంస్థ నాయకుడు, తలపై కోటి రూపాయల బహుమతి ఉన్న నేరగాడు. ప్రజల్లోనేమో ప్రత్యేకంగా శ్రామిక వర్గానికి ఆయన గొప్ప విప్లవకారుడు. పేద ప్రజల బాధలు చూడలేకనే విప్లవోద్యమంలో చేరాడని బహిరంగంగా ఆయన సంతాప సభలు జరుగుతున్నాయి.ప్రభుత్వానికి వాంటెడ్ టెర్రరిస్ట్, కష్టజీవులకు డియర్ కామ్రేడ్. ప్రభుత్వాలు వేటాడుతుంటే ప్రజలు దాచుకుంటున్నారు. ఈ వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన పేద ప్రజలకు నక్సలైట్లు బాసటగా నిలిచి తుపాకీ గొట్టం ద్వారా న్యాయాన్ని అందించారని అనుకోవాలా! రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన ప్రభుత్వాల వైఫల్యాలకు ప్రత్యామ్నాయంగా వీరి ఉనికి అనివార్యమా! వీరి జీవితాలు ఎవరికి పాఠాలు నేర్పుతాయి? వీరి త్యాగాలు ఏ ఖాతాలో చేరుతాయి?
బి.నర్సన్- 9440128169