హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన తారాగణంగా ఆర్.టి.టీమ్ వర్క్స్, గోల్ డెన్ మీడియా బ్యానర్స్‌పై కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘సుందరం మాస్టార్’. సుందరం అనే టీచర్ చుట్టూ నడిచే కథే ఇది. తను గవర్నమెంట్ టీజర్. సోషల్ స్టడీస్ బోధిస్తుంటాడు. అయితే మిర్యాల మెట్ట అనే మారుమూల పల్లెలో ఇంగ్లీష్ టీచర్‌గా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అందులో అన్నీ వయసులవారు ఇంగ్లీష్ నేర్చుకోవటానికి విద్యార్థులుగా వస్తారు. మరి సుందరం మాస్టార్ వారికెలా ఇంగ్లీష్‌ను బోధించారు అనే విషయం తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందేనంటున్నారు మేకర్స్.
సుధీర్ కుమార్ కుర్రుతో కలిసి మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. గురువారం ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రవితేజ విడుదల చేసి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తోన్న ఈ మూవీకి దీపక్ ఎరెగడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని చిత్ర నిర్మాతలు తెలిపారు.