గ్వాలియర్ : ఉత్తరప్రదేశ్ లోని ముజఫుర్ పూర్ నుంచి గుజరాత్ వెళ్తున్న సూరత్ ఎక్స్‌ప్రెస్ స్టేషన్‌లో కొందరు దుండగులు ఒక మహిళపై అత్యాచారానికి ప్రయత్నించారు. బాధితురాలు అడ్డుకోడానికి ప్రయత్నించగా బాధితురాలితోపాటు ఆమె బంధువును కూడా రైలు నుంచి కిందకు తోసేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈ సంఘటన గ్వాలియర్ లోని బిలౌవా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జూన్ 19న కూలి పనులు చేసుకునే ఒక మహిళ తన బంధువుతోపాటు సూరత్ ఎక్స్‌ప్రెస్‌లో లక్నోమీదుగా గుజరాత్ లోని సూరత్
వెళుతోంది. బాధిత మహిళ జార్ఖండ్ లోని పాలమూ జిల్లాకు చెందినది.
ఆమె ప్రయాణిస్తున్న రైలు లోకి గ్వాలియర్‌లో ఐదుగురు పురుషులు ఎక్కారు. కొద్దిసేపటి తరువాత వారంతా ఆ మహిళను చూసి వెకిలి చేష్టలు చేయడం ప్రారంభించారు. ఆమె ఫోటోలు తీయడానికి ప్రయత్నించారు. దీనికి ఆమె వ్యతిరేకించడంతో ఆమెను, ఆమె బంధువును కొట్టారు. దీంతో బాధితురాలు , ఆమె బంధువు రైలు బోగీ లోని డోర్ దగ్గరకు వెళ్లి నిలుచున్నా దుండగుల దురుసుతనం ఆగలేదు. ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారు. దీనిని ఆమె వ్యతిరేకించడంతో ఆమెను, ఆమె బంధువును నడుస్తున్న రైలు నుంచి కిందకు తోసేశారు. బాధితులు బరౌడీ గ్రామ సమీపంలో పడిపోయారు. సోమవారం రాత్రంతా బాధితులు రైలు పట్టాల సమీపంలో స్పృహ తప్పిన స్థితిలో పడి ఉన్నారు.
మంగళవారం ఉదయం గ్రామస్థులు వారిని చూసి పోలీస్‌లకు తెలియజేయగా, వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుల ఫిర్యాదుపై రైల్వే స్టేషన్ లోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీస్‌లు కేసు దర్యాప్తు చేస్తున్నారు.