హైదరాబాద్: తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాగల మూడురోజుల్లో మిగతా ప్రాంతాలకు విస్తరించే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం ఖమ్మం వరకు ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రాగల రెండు, మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని తెలిపింది. ఫలితంగా రాగల మూడు నుంచి ఐదురోజుల పాటు ఉమ్మడి ఖమ్మం, ములుగు, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతోపాటు మరికొన్ని జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
నేడు ములుగు, భద్రాద్రి కొత్తగూడెంలో….
నేడు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. రేపు శుక్రవారం నుంచి శనివారం వరకు భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో, శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమురభీం ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.
ఆదివారం నుంచి సోమవారం వరకు అతి భారీ వర్షాలు
ఈనెల 25వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఆదిలాబాద్, కుమురభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. 26వ తేదీ నుంచి 27వ తేదీ ఉదయం వరకు ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
సాగుకు రైతుల సమాయత్తం
వాతావరణ కేంద్రం ప్రకటనతో వర్షాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న రైతన్నలు సాగుకు సమాయత్తం కానున్నారు. ఇన్ని రోజులు అధిక ఉష్ణోగ్రతలకు, ఉక్కపోతలకు ఉక్కిరిబిక్కిరైన ప్రజలు తొలి చినుకుల భాగ్యం దక్కి కాస్త ఊపిరి పీల్చుకున్నారు. గురువారం ఆకాశం మేఘావృతం కావడంతో ఒక్కసారిగా వాతావరణం మొత్తం చల్లబడింది. దీంతో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో అప్పటివరకు వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది.