మక్తల్ ః మనస్థాపంతో గోవిందమ్మ(26) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మక్తల్ మండలంలోని గుడిగండ్లలో గురువారం మధ్యాహ్నం జరిగింది. గ్రామానికి చెందిన లొడ్డ వెంకటప్ప, ఆశమ్మల కూతురైన గోవిందమ్మకు 2013లో జక్లేర్ గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరగ్గా, రెండేళ్ల తర్వాత భర్త మృతి చెందాడు. అప్పటి నుంచి గుడిగండ్లలోని తల్లిదండ్రుల వద్దే ఉంటున్న గోవిందమ్మ, ఇటీవల కుటుంబంలో చోటు చేసుకున్న సంఘటనతో మనస్థాపం చెంది 10 రోజుల క్రితం ముంబైలోని బంధువుల వద్దకు వెళ్లింది.
ఈ క్రమంలోనే గురువారం ఉదయం తిరిగి గ్రామానికి వచ్చిన గోవిందమ్మ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మక్తల్ ప్రభుత్వ దవాఖానలో వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించినట్లు మక్తల్ ఎస్సై పర్వతాలు తెలిపారు.