పెద్దపల్లి: అమరుల త్యాగఫలంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ భాను ప్రసాద్ రావు అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద గల అమర వీరుల స్థూపం వద్ద నిర్వహించిన సంస్మరణ దినోత్సవంలో శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ భాను ప్రసాద్ రావు, జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.
అమరులను స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా భాను ప్రసాద్ రావు మాట్లాడుతూ తొలి, మలి, తుదిదశ ఉద్యమాల్లో రాష్ట్ర సాధనకు అనేక మంది ప్రాణాలను అర్పించారని, వారి త్యాగాల ఫలితంగా రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. 2001లో సీఎం కేసీఆర్ ఉద్యమాన్ని ప్రారంభిం చారని, 14 ఏళ్లపాటు ఉద్యమాన్ని శాంతి పంథాలో నడిపించారని, యవకులు, విద్యార్థులు బలిదానం చేసుకున్నారని, ప్రత్యేక రాష్ట్ర సాధనలో అమరవీరుల పాత్ర శాశ్వతంగా నిలిచిపోతుందని చీఫ్ విప్ పేర్కొన్నారు.
అమరుల త్యాగంతో ఏర్పడిన ప్రత్యేక తెలంగాణలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దామని, గత 20 రోజులుగా వివిధ శాఖల నుంచి అందుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను, వచ్చిన మార్పులను వివరిస్తూ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నామని ఆయన తెలిపారు.
పెద్దపల్లి జిల్లా పరిధిలో రాష్ట్ర సాధనలో 37 మంది అమరులైనారని, వీరి త్యాగాలను గుర్తిస్తూ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి పది లక్షలు, అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించిందని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమ ఆకాంక్షలను, అమరవీరుల ఆశయాలను నెరవేరుస్తూ అద్భుత పాలన సాగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ 14 ఏళ్ల పాటు సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల వారు పాల్గొన్నారని, జయశంకర్, కొండా లక్ష్మన్ బాపూజీ వంటి మహనీయులు అందించిన సహాయ, సహకారాలు, వారి స్పూర్తితో సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమ వేడిని ఢిల్లీకి తాకేలా పోరాటం చేశారని అన్నారు.
అనేక మంది ఉద్యకారులు చేసిన త్యాగాల ఫలితంగా రాష్ట్రం ఏర్పడిందని, వీరి త్యాగాలను మనం నిరంతరం స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు ఐకమత్యంతో కృషి చేయాలని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని అమరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. అనంతరం కలెక్టరేట్‌లో అమరవీరుల కుటుంబాలతో కలిసి ఎమ్మెల్సీ, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ ఆల్పాహారం స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో అమరవీరుల కుటుంబ సభ్యులు, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్‌సింగ్, మున్సిపల్ చైర్మెన్ దాసరి మమత, జడ్పీడీసీలు బండారి రామ్మూర్తి, బొద్దుల లక్ష్మణ్, తిరుపతిరెడ్డి, ఎంపీపీ బాలాజీరావు, కౌన్సిల్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.