వాషింగ్టన్: ప్రజా ప్రయోజనాలు కాపాడడమే లక్షంగా భారత్, అమెరికాలు పని చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇరు దేశాల వ్యవస్థలు సంస్థలు ప్రజాస్వామ్య పునాదులపై నిర్మించి ఉన్నాయని అన్నారు. అమెరికాలో తనకు దక్కిన గౌరవం 140 కోట్ల భారతీయులకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు మోడీ చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ గురువారం అధ్యక్షుడు జో బైడెన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు వైట్‌హౌస్‌కు చేరుకున్న సందర్భంగా ఘన స్వాగతం లభించింది. బైడెన్ దంపతులు మోడీకి ఘనస్వాగతం పలికారు. ఆయనకు గౌరవ సూచకంగా సైనికులు 19 రౌండు ్లగాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. మూడు దశాబ్దాల క్రితం సామాన్యుడిగా అమెరికా పర్యటనకు వచ్చినట్లు గుర్తు చేసుకున్నారు.‘ నాడు వైట్‌హౌస్‌ను బయటినుంచి చూశారు. ప్రధాని అయ్యాక చాలాసార్లు అమెరికా వచ్చాను. తాజాగా పెద్ద ఎత్తున జననీరాజనాలతో వైట్‌హౌస్ గేట్లు తెరుచుకున్నాయి. ఈరోజు వైట్‌హౌస్ వద్ద నాకు లభించిన ఘన స్వాగతం 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. అమెరికాలో ఉంటున్న 40 లక్షల మందికి పైగా భారతీయ ప్రజలకు దక్కిన గౌరవం కూడా’ అని ప్రధాని అన్నారు. అమెరికాలో నివసిస్తున్న ఎన్‌ఆర్‌ఐలు దేశ గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్నారు. భారతీయులు తమ నిబద్ధత, నైపుణ్యంతో దేశ ప్రతిష్ఠను పెంపొందింపజేశారు.
కొవిడ్ విపత్తు వేళ ప్రపంచం కొత్త రూపు సంతరించుకుంది. ఇరు దేశాల స్నేహం విశ్వ సామర్థాన్ని పెంచేందుకు దోహదం చేసింది. ప్రపంచ ఆహార భద్రత కోసం ఇరుదేశాలు కలిసి పని చేసేందుకు కంకణబద్ధమై ఉన్నాయి.ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రజాస్వామ్య గొప్పతనానికి నిదర్శనం అని ప్రధాని మోడీ అన్నారు. రెండో సారి అమెరికా కాంగ్రెస్‌నుద్దేశించి ప్రసంగించే అవకాశం లభించినందుకు ఎంతో కృతజ్ఞుడిగా ఉన్నానని కూడా ఆయన అన్నారు.
చర్చలు ప్రారంభం
బైడెన్‌తో మోడీ ద్వైపాక్షిక చర్చల అనంతరం ఇరు దేశాల ప్రతినిధి స్థాయి చర్చలు జరగనున్నాయి. అమెరికా ప్రతినిధి బృందంలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, ణిజ్య, ఇంధన శాఖల మంత్రులు, జాతీయ భద్రతా వ్యవహారాల్లో అధ్యక్షుడి సలహాదారు జేక్‌సల్లివాన్, భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి పాల్గొననుండగా, భారత ప్రతినిధి బృందం తరఫున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాట్రా, అమెరికాలో భారత రాయబారి తరన్‌జిత్ సింగ్ సంధు తదితరులు పాల్గొంటారు.