ఖమ్మం : జిల్లాలోని ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, గృహలక్ష్మి పథకం 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలు ప్రకటించిందని, 2022లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, సంవత్సరకాలం పూర్తి కావస్తుందని డబుల్ బెడ్ రూమ్‌కు ప్రత్యామ్నాయంగా గృహలక్ష్మి పథకాలను కెసిఆర్ ప్రకటించారని అన్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో మార్గదర్శకాలు ఇచ్చారని, ప్రభుత్వం లబ్ధిదారులకు ఈ పథకాన్ని ఆలస్యం చేయకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పథకం క్రింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 5000 ఇండ్లు మొదటి దశలో ఇవ్వాలన్నారు. దరఖాస్తులు స్వీకరించాలని అందులో కనీసం 5000 మందికి ఇవ్వాలని, ఈ పథకాన్ని దశలవారీగా అమలు చేయాలని, ప్రతి పేదవారికి ఇల్లు ఇచ్చేదాకా ఈ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు . ప్రభుత్వం ప్రకటించిన మార్గదర్శకాలు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయని, ఈ పథకంలో మూడు లక్షల రూపాయలు ప్రకటించారని, ఈ పథకంలో పూర్తి సబ్సిడీ అని ప్రకటించారని దాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.
గతంలో ఇందిరమ్మ పథకాలలో కొంత డబ్బులు కట్టే పరిస్థితి ఉండేదని తెలిపారు. 100 శాతం సబ్సిడీ ప్రకటించారని సంతోషమని అన్నారు. అయితే 3 లక్షల రూపాయలతో ప్రభుత్వం చెప్పే నమూనాతో డబుల్ బెడ్రూం ఇల్లు సాధ్యమయ్యే పని కాదని అన్నారు. ఏమీ లేని పేదవాడు సొంత ఆస్తి గాని ఎటువంటి ఆస్తిగా లేనివాడు ఇల్లు కట్టుకోవాలంటే 3 లక్షలతో సాధ్యమేనా అని ప్రశ్నించారు. 3 లక్షల్లో ఇల్లు సాధ్యం కాదని అర్థమైంది అన్నారు. పైగా ప్రకటించిన నాటికి ఇప్పటికి ధరలను పోలిస్తే బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్, కూలీల ఖర్చు అన్నిటికీ 40 శాతం పెరిగిందన్నారు.
ఈ 3 లక్షల పథకం విజయవంతం కాదు అని అన్నారు. పది కాలాలపాటు ఇల్లు ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు కట్టిస్తామని, జిల్లాలో ఏ ఒక్క ఇల్లు కూడా కట్టలేదని ఆరోపించారు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు, కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు ఇచ్చేదాకా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని అన్నారు. మొత్తం 15 లక్షలు ఉంటే తప్ప రెండు పడకల ఇల్లు నాణ్యతతో నిర్మాణం అవుతుందని అన్నారు. వీటిపై సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
నియోజకవర్గానికి 3 వేలు కాకుండా 5 వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి సభ్యులు వై. విక్రమ్, జిల్లా కమిటీ సభ్యులు ఎర్రా శ్రీనివాసరావు, త్రీ టౌన్ కార్యదర్శి భూక్యా శ్రీను, ఖమ్మం నియోజకవర్గ నాయకులు ఎస్కే మీరా సాహెబ్, రఘునాథపాలెం మండల కార్యదర్శి నవీన్ రెడ్డి, ఖమ్మం టూ టౌన్ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.