Tuesday, December 24, 2024

వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు అవుతున్నది. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం వెనకబడిపోయిందని, పేదరికంతో బాధపడుతున్న ప్రాంతం అన్న భావన ఉండేది. ఇక అలాంటి పరిస్థితుల నుండి తెలంగాణ ఎదిగి, దేశ ఆర్థిక వ్యవస్థకు చేదోడుగా ఉన్న మూడవ అతి పెద్ద రాష్ట్రంగా అవతరించిందని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వెల్లడించడం దేశ ఆర్థిక రంగంలో తెలంగాణ సాధించిన అద్భుతమైన ప్రగతికి నిదర్శనం. తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో 11వ స్థానంలో ఉంది. అలాగే దేశంలో జనాభా పరంగా 12వ స్థానంలో ఉంది. కానీ దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడే విషయంలో నేడు మూడవ స్థానంలో ఉంది. వ్యవసాయం, అటవీ, ఫిషింగ్, తయా రీ, మైనింగ్ -క్వారీ, నిర్మాణం, ఆర్థిక సేవలు,

రియల్ ఎస్టేట్, రవాణా, కమ్యూనికేషన్, బ్రాడ్‌కాస్టింగ్, హోట ళ్లు, రెస్టారెంట్‌లకు సంబంధించిన ఇతర అనేక రంగాలలో తెలంగాణ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకారాన్ని అందిస్తోంది. తెలంగాణ అతి తక్కువ సమయంలోనే ఆర్థిక ప్రగతిలో సుసంపన్న రాష్ట్రంగా అవతరించింది. రాష్ట్ర ప్రభుత్వ పటిష్ఠ ప్రణాళికతో ఆర్థికంలో అందనంత ఎత్తుకు ఎదిగింది. ఒక రాష్ట్ర ప్రగతికి జిఎస్‌డిపి, తలసరి ఆదాయమే ప్రామాణికం. ఆ రెండింటిలోనూ తెలంగాణకు తిరుగులేదని ఇప్పటికే తేలిపోయింది. తొమ్మిదేండ్లలో జిఎస్‌డిపి మూడు రెట్లు పెరిగింది. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానానికి ఎగబాకింది.
2005- 06 నుండి 2021 -22 వరకు తాజా సమాచారం ప్రకారం రాష్ట్రం సగటున 8.6% స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జిఎస్‌డిపి) వృద్ధి రేటును నమోదు చేసింది, ఇది దేశంలోనే మూడవ అత్యధికం. 2005-06, 2021- 22 మధ్య స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ (ఎంఒఎస్‌పిఐ) అందించిన డేటా ఆధారంగా వ్యవసాయ ఆర్థికవేత్తలు దేశంలోని వివిధ రాష్ట్రాల పని తీరుపై ఒక నివేదికను రూపొందించారు. ఇదే విషయాన్ని ఇటీవల కొన్ని ఆర్థిక ప్రచురణలు ప్రచురించాయి. దీని ప్రకారం తెలంగాణ జిఎస్‌డిపి సగటు వార్షిక వృద్ధిరేటు(ఎఎజిఆర్) 8.6% ఉంది. జిఎస్‌డిపిలో 8.9% ఎఎజిఆర్‌తో గుజరాత్ అగ్రస్థానంలో ఉండగా, ఉత్తరాఖండ్ 8.7 శాతంతో రెండో స్థానంలో, తెలంగాణ మూడో స్థానంలో నిలిచాయి.

ఆర్థిక వ్యవస్థ, పరిమాణం, జాతీయ ఆర్థిక వ్యవస్థకు సహకారం పరంగా ఉత్తరాఖండ్ చాలా చిన్న రాష్ట్రం అనే వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంటే గుజరాత్ తర్వాత తెలంగాణ రెండవ స్థానంలో ఉంది. జిఎస్‌డిపిలో భారీ వృద్ధికి ప్రధానంగా తెలంగాణ వ్యవసాయ జిఎస్‌డిపిలో పెరుగుదల కారణమని చెప్పవచ్చు. ఇది ఈ కాలంలో సగటు 6.4 శాతంతో మూడవ స్థానంలో ఉంది. వ్యవసాయం, అనుబంధ రంగాలలో మధ్యప్రదేశ్ అత్యధిక ఎఎజిఆర్ 7.3% కలిగి ఉండగా, ఆంధ్రప్రదేశ్ 6.6 శాతంతో రెండవ స్థానంలో ఉండగా, జార్ఖండ్ , తెలంగాణ 6.4 శాతంతో మూడో స్థానంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2018- 19లో 9.5 శాతం, 2019 -20లో 8.2 శాతం, 2020-21లో 2.4 శాతం, 2021- 22లో 19.1 శాతం, 2022- 23లో 15.6 శాతం జిఎస్‌డిపి వృద్ధి రేటును స్థిరంగా నమోదు చేస్తోంది.

2015 -16 నుంచి తెలంగాణ జిఎస్‌డిపికి సంబంధించిన ఎఎజిఆర్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఇతర రాష్ట్రాలలో తెలంగాణ సులభం గా అగ్రస్థానంలో నిలిచిఉండేది. పార్లమెంట్‌లో కేంద్రం సమర్పించిన గణాంకాల ప్రకారం గత ఎనిమిదిన్నరేళ్లలో తెలంగాణ జిజీఎస్‌డిపి రెండింతలు పెరిగి దాదా పు రూ. 13.27 లక్షల కోట్లకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2013-14 ఆర్థిక సంవత్సరంలో, రాష్ట్ర జిఎస్‌డిపి రూ. 5.05 లక్షల కోట్లు కాగా, 2022 -23 నాటికి రూ. 13.27 లక్షల కోట్లకు చేరుకుంది. తొమ్మిదేండ్లలోనే జిఎస్‌డిపి మూడు రెట్లు పెరిగింది. గణనీయంగా 186 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. 2022-23లో దేశ జిడిపి రూ. 2,72,03,767 కోట్లు కాగా, దీంట్లో తెలంగాణ వాటా 4.7 శాతం. 2020-21లో ఒకవైపు కరోనా ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపినప్పటికీ ఆ సమయంలో దేశ జిడిపి -1.4 శాతానికి పడిపోగా, తెలంగాణ మాత్రం 1.2 వృద్ధి రేటును నమోదు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

అనతి కాలంలోనే సుసంపన్న రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ గత తొమ్మిదేండ్లలో అనేక పెద్ద రాష్ట్రాలను అధిగమించింది, అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. వయసులో చాలా చిన్న రాష్ట్రమైనప్పటికీ దశాబ్దాల చరిత్ర కలిగిన పలురాష్ట్రాలకు ఆర్థిక వృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది. స్వరాష్ట్ర ఏర్పాటు (2014-15) నాటికి రూ. 5.05 లక్షల కోట్లుగా ఉన్న తెలంగాణ జిఎస్‌డిపి, గత ఆర్థిక సంవత్సరం (2022-23) చివరి నాటికి అనూహ్యంగా రూ.13.3 లక్షల కోట్లకు ఎగబాకింది. తలసరి ఆదాయంలోనూ తెలంగాణ తిరుగులేని ప్రగతిని చూపుతున్నది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.1,12,162 కోట్లుగా ఉన్న తెలంగాణ తలసరి ఆదాయం, గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,75,443 కోట్లకు పెరిగింది. తద్వారా ప్రస్తుతం దేశ జిడిపిలో తెలంగాణ సుమారు 5 శాతం వాటాను కలిగి ఉన్నది.
ఆర్థిక రంగంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్రంగా ఏర్పడిన తొమ్మిదేళ్ల తక్కువ సమయంలోనే దేశంలో ఆర్ధికంగా ఉత్తమ స్థానంలో ఉండటం, పటిష్టమైన ప్రభుత్వ ప్రణాళికలు, పలు రంగాలపై ప్రత్యేక పర్యవేక్షణ, శ్రద్ధ లాంటివి ఈ స్థానంలో ఉండేలా చేశాయి. తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉండి, జిఎస్‌డిపి గ్రోత్ రేట్ ఉన్న తెలంగాణతో పాటు ఉన్న దక్షిణాది రాష్ట్రాలే దేశానికి జీవనాడి పేర్కొనవచ్చు. ఎందుకంటే నేడు దేశ జిడిపిలో దక్షిణాది ఐదు రాష్ట్రాల వాటానే 30 శాతం ఉంది. 2022- 23 ఆర్థిక సంవత్సరంలో తమిళనాడు జిఎస్‌డిపి రూ.24.8 లక్షల కోట్లు, కర్ణాటక జిఎస్‌డిపి రూ.22.4 లక్షల కోట్లు, తెలంగాణ జిఎస్‌డిపి రూ. 13.3 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ జిఎస్‌డిపి రూ.13.2 లక్షల కోట్లు, కేరళ జిఎస్‌డిపి రూ.10 లక్షల కోట్లు ఉన్నది.

దేశంలో దక్షిణాది రాష్ట్రాల జనాభా వాటా 19 శాతం. మిగిలిన రాష్ట్రాల జనాభా వాటా 79 శాతం. దేశ జిడిపిలో దక్షిణాది రాష్ట్రాల వాటా 30 శాతం. దేశాన్ని సాకుతున్న రాష్ట్రాల్లో దక్షిణాదే కీలకపాత్ర పోషిస్తున్నది. 2022- 23 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం తెలంగాణ రూ.2,75,443 తలసరి ఆదాయంతో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నది. ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో రూ. 2,65,623తో కర్ణాటక రెండో స్థానంలో నిలిచింది. తమిళనాడు రూ. 2,41,131, కేరళ రూ. 2,30,601 తలసరి ఆదాయంతో మూడు, నాలుగో స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ రూ. 2,07,771 తలసరి ఆదాయంతో చివరి స్థానంలో నిలిచింది. ఈ దక్షిణాది రాష్ట్రాలన్నీ జాతీయ సగటు రూ.1,50,007 కంటే ఎకువ తలసరి ఆదాయాన్ని కలిగి ఉన్నాయి.రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉన్నదని చెప్పడానికి జిఎస్‌డిపిలో రుణాల రేషియో ఏ మేరకు ఉన్నదనే విషయాన్ని ఆర్‌బిఐ ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటుంది.

రుణాలు- జిడిపి రేషియో తక్కుగా ఉంటే ఆ రాష్ట్రం ఆర్థికంగా బలంగా ఉన్నట్టు ఆర్‌బిఐ పరిగణిస్తుంది. ఈ విషయంలోనూ దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. అందులోనూ తెలంగాణ టాప్ ప్లేస్‌లో నిలుస్తున్నది. రుణం- జిడిపి రేషియో అతి తక్కువగా తెలంగాణలో 25.3 శాతంగా ఉన్నది. కర్ణాటకలో 27.5 శాతం, తమిళనాడులో 27.7 శాతం, ఆంధ్రప్రదేశ్ లో 32.8 శాతం, కేరళలో 37.2 శాతంగా ఉన్నది. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే ఈ ఐదు దక్షిణాది రాష్ట్రాలు రుణాలు తీసుకోవడంలోనూ ఆదర్శంగానే ఉన్నాయి. అలాగే వడ్డీలకు అత్యల్పంగా 11.3 శాతాన్ని చెల్లిస్తూ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ నిలుస్తున్నదని ఆర్‌బిఐ పేర్కొంది. తెలంగాణ నేడు దేశంలో ఆర్ధిక వ్యవస్థలో గొప్ప స్థానంలో తెచ్చిన ప్రభుత్వ కృషి అభినందనీయం. తెలంగాణ ఆర్ధిక వ్యవస్థ మరింత బలపడేలా ప్రభుత్వం మరిన్ని ప్రణాళికలు, చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News