ముషీరాబాద్ ః నాయకత్వంలో వచ్చిన ఆధిపత్య దోరణుల కారణంగానే ప్రగతిశీల మహిళా సంఘం చీలిపోవాల్సి వచ్చిందని, ఇప్పటికైనా పార్టీలుగా విడిగా ఉన్నా.. పిఓడబ్లూగా కలిసుందామని, మహిళా ఉద్యమాలు లేకపోవడం వల్లనే సమాజంలో డ్రగ్స్, మత్తు పదార్థాలు సంస్కృతి విచ్చలవిడిగా పెరిగిపోతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రగతిశీల మహిళా సంఘం (పిఓడబ్లూ) అర్థ శతాబ్ద వార్షికోత్సవ ప్రారంభ సమావేశం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సిపిఐ(ఎంఎల్ ) న్యూడెమోక్రసీ పార్టీల్లోని వివిధ వర్గాలకు చెందిన మహిళా సంఘాల ప్రత్యేక సమావేశం గురువారం జరిగింది. పిఓడబ్లూ స్త్రీ విముక్తి మాజీ రాష్ట్ర అధ్యక్షురాలు అంబిక అధ్యక్షత వహించగా, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె. సంధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హజరైన ప్రొఫెసర్ రమా మేల్కోటే మాట్లాడుతూ గతంలో స్త్రీలపై రకర కాల హింసలకు పాల్పడుతూ పురుషులు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేవారని అన్నారు. ప్రస్తుత ఆధునిక సమాజంలో స్త్రీలు సైతం హింస కార్యక్రమాలలో భాగస్వామ్యం అవుతున్నారని అన్నారు. ఈ దోరణి మారాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్త్రీలలో పెరుగుతు న్న హింస కారణంగా భార్యా బాధితుల సంఘాలు ఉద్భవించినట్టు ఆమె స్పష్టం చేశారు. ఈ అంశాలను ప్రగతిశీల మహిళా సంఘం సానుకూల థృక్పథంతో ఆలోచించి స్త్రీల హింసను కూడా మార్చేందుకు ప్రయత్నాలు చేయాలని సూచించారు.
పిఓడబ్లూ అర్థ శతాబ్ద ఉత్సవాలలో భాగంగా మహిళా మేధావులతో పిఓడబ్లూ వ్యవస్థాపక సభ్యులతో కలిసి ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మహిళా రాజకీ య, దళిత, ఆదివాసీ, ముస్లీం, కామన్ సివిల్ కోడ్ సమస్యలపై రెండు తెలుగు రాష్ట్రాలలో సెమినార్లు జరపాలని, నాలుగు పిఓడబ్లూ సంస్థలు కలిసి సాంస్కృతిక ఉద్యమాలను ఉదృతం చేసేందుకు కార్యచరణ చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. సమావేంలో ఝాన్సీ, సంధ్య, విమల, స్వరూప, లక్ష్మీ, గంగ, రమాసుందరరి, కత్తి పద్మ, చూపు కాత్యాయని, ప్రొఫెసర్ లక్ష్మీ, గుత్తా జ్యోత్స తదితరులు పాల్గొన్నారు.