నాగిరెడ్డిపేట్ : నాగిరెడ్డిపేట్ మండలం చిన్నూర్ వాడి గ్రామానికి చెందిన బాల్ లింగం ఏసు 22 మృతదేహం శుక్రవారం గోలి లింగాల గ్రామ శివారు పరివాహక ప్రాంత మంజీరా నదిలో లభించినట్లు ఎస్సై డి.ఆంజేయులు తెలిపారు. బాల్ లింగం ఏసు గురువారం వాడి గ్రామానికి చెందిన పబ్బతి మంజుల మంజీరా నది పరివాహక సమీపంలో ఉన్న భూమిలో కూలీ పనికి వెళ్లాడు. వ్యవసాయ భూమిలో వరి నారు కోసం వడ్ల విత్తనాలు వేసి తుకము పోసిన అనంతరం మంజీరా నదిలోకి స్నానం చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి నదిలో పడిపోయాడు.
ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడని ఏసు తండ్రి బాల్‌లింగం సిద్దయ్యకు ఫోన్ ద్వార తెలిపారు. తన తండ్రి చుట్టు పక్కల గ్రామస్థులతో కలిసి నదిలో గురువారం వెతకగా ఎక్కడా కనిపించలేదు. శుక్రవారం ఉదయం నదిలో మృతదేహం కోసం గాలించగా ఏసు మృతదేహం నీటిలో మునిగి ఉందని, మృతదేహాన్ని బయటకు తీసి మృతుడి తండ్రి బాల్ లింగం సిద్దయ్య ఫిర్యాదు చేశారు. మృతుడి తండ్రి ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడు బాల్‌లింగం కు దాయరంచ గ్రామానికి చెందిన సుమలత తో ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది.