పెనుబల్లి: అనారోగ్య సమస్యలతో తీవ్ర మనసస్తాపానికి గురైన దంపతులు కుమార్తె సహా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. కొత్త కారాయిగూడెం గ్రామానికి చెందిన పోట్రు వెంకట కృష్ణారావు (40), భార్య సుహాసిని (35) దంపతులకు కూతురు అమృత (19), కుమారుడు కార్తీక్ ఉన్నారు. సుహాసినికి నెలన్నర క్రితం కృష్ణా జిల్లా తిరువూరులో గర్భసంచికి శస్త్ర చికిత్స చేశారు. అప్పుడు నమూనాలను పంపగా గురువారం సుహాసినికి క్యాన్సర్ ఉన్నట్లు నిర్థారణ అయింది.
దీంతో తిరువూరు వైద్యులను సంప్రదించగా కీమో థెరపీ చేయించుకోవాలని వారు సూచించారు. ఈ క్రమంలో ముగ్గురు తీవ్ర మనోవేదనకు లోనయ్యారు. తిరువూరు నుంచి తమ స్వగ్రామానికి వచ్చే సమయంలో మూడు స్టూళ్లు, మూడు తాళ్లు కొనుగోలు చేసుకొని వచ్చారు. అనంతరం కొత్త కారాయిగూడెంలోని వారి మామిడితోటలో గురువారం రాత్రి చెట్లకు ముగ్గురు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.
శుక్రవారం ఉదయం స్థానికులు వీరి మృతదేహాలను గమనించి పోలీసులను సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని వియం. బంజర రూరల్ సిఐ హనూక్, ఎస్‌ఐ సూరజ్‌లు సందర్శించి మృతదేహాలను పెనుబల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కుమారుడు కార్తీక్ బెంగుళూరులో బీటెక్ పూర్తి అయిందని,.సుహాసిని అనారోగ్యానికి గురవటం మూలంగానే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని, ఎటువంటి ఆర్థిక సమస్యలు కానీ, కుటుంబ కలహాలు కానీ లేవని గ్రామస్థులు తెలిపారు.