రాగల 12 రోజుల్లో రాష్ట్రమంతటా వ్యాప్తి
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షాలు నమోదు
హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురువారం ఖమ్మంలోకి ప్రవేశించిన రుతుపవనాలు శుక్రవారం నిజామాబాద్ వరకు విస్తరించినట్లు తెలిపింది. రాగల 1-2 రోజుల్లో తెలంగాణ అంతటా నైరుతి విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. శుక్రవారం ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరలో సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీల వరకు కొనసాగుతూ ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి దిశగా కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు నైరుతి రాకతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. గురువారం నుంచే ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో పలుచోట్ల అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్‌లో భారీ వర్షం పడడం, రహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
నేడు, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు
రాగల మూడు రోజులు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాలైన నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
సిద్ధిపేట జిల్లాలో భారీ వర్షం
నైరుతి రుతుపవనాల ప్రభావంతో సిద్ధిపేట జిల్లాలో సుమారు గంటసేపు కుండపోత వర్షం కురిసింది. వర్షం ప్రభావంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వర్షం పడటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కొంతకాలంగా ఎండలు దంచికొట్టడంతో వేడెక్కిన వాతావరణంతో శుక్రవారం కురిసిన వర్షానికి కాస్త చల్లబడింది.
ఈదురుగాలులకు నేలకొరిగిన చెట్లు
హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతం వరకు భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు వీచడంతో అక్కడక్కడ చెట్లు నెలకొరిగాయి. వర్షం ప్రభావంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని రోజుల నుంచి ఎండ తీవ్రతకు ఇబ్బంది పడిన భాగ్యనగర వాసులు నైరుతి రుతుపవనాలు పలకరించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.