నాగర్‌కర్నూల్ : రోజురోజుకు పెరుగుతున్న పర్యావరణ మార్పులతో మానవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది. అంతరించిపోతున్న అడవులను రక్షించుకోవాలని గ్రామాలు, పట్టణాలలో పచ్చదనం పరమళ్లించాలనే లక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమానికి కెసిఆర్ ప్రభుత్వం నడుం బిగించింది. భావి తరాలకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని భావించి ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం పథకం ప్రస్తుతం అబాసు పాలు అవుతుంది. పంచాయతీ పట్టింపులేని, అధికారుల పర్యవేక్షణ పూజ్యంతో మొక్క దశలోనే వాడిపోతున్నాయి. హరితహారంలో నాటిన మొక్కలు నాటిన కొత్తలో కొన్ని రోజులు వాటి రక్షణ, నీరందించే కార్యక్రమం నామమాత్రంగా చేపడుతూ అనంతరం మొక్కలను సంరక్షించడానికి అధికారులు, పాలకులు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో మొక్కలు ఎండిపోతున్నాయి.
దీనికి తోడు రైతులు వర్షాకాలం పంటలు వేసేందుకు భూములు సిద్ధం చేస్తున్న తరుణంలో గడ్డితో పాటు పిచ్చి మొక్కలకు నిప్పంటించడంతో హరితహారంలో నాటిన మొక్కలు మంటల్లో కాలిపోతున్నాయి. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు, గ్రామ పాలకులు చూస్తున్నా తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. రెండు రోజుల క్రితం మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రామంలో గ్రామ సమీపంలో గల వ్యవసాయ పొలంలో పొలం యజమాని పిచ్చిమొక్కలను తొలగించేందుకు నిప్పంటించడంతో పెద్దాపూర్, గుడిపల్లి ప్రధాన రోడ్డు పక్కన నాటిన మొక్కలు అగ్నికి ఆహుతయ్యాయి. రెండు రోజులుగా హరితహారం మొక్కలను రక్షించేందుకు పనులు చేపడుతున్న అధికారులు విషయం తెలిసిన పట్టించుకోలేదని గ్రామస్తులు అధికారులు, పాలకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత పొలం యజమానిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఉపాధి హామి పథకంలో భాగంగా లక్షల రూపాయలు వెచ్చించి పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీకి ఆమడ దూరంలో జనసంచారం లేని ప్రాంతంలో నిర్మించడంతో లక్షలాది రూపాయలు వృథా అవుతున్నాయని విమర్శలు ఉన్నాయి. హరితహారం కార్యక్రమాన్ని పర్యవేక్షించాల్సిన పంచాయతి, మండల పరిషత్ అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని, నాటిన మొక్కలు రెండేళ్ల పాటు మానుగా ఎదిగేంత వరకు పంచాయతీలదే బాధ్యత, మొక్కలు చనిపోతే వాటి స్థానంలో మరో మొక్కను నాటి సంరక్షించాలని అధికారులు చెబుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. బాధ్యతరహితంగా వ్యవహరించిన అధికారులపై మొక్కలు మంటల్లో కాలుతున్న పొలం యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఎంపిడిఓ కోటేశ్వర్ వివరణ… మండల పరిధిలోని ఆయా గ్రామాలలో నాటిన మొక్కలను సంరక్షించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చిన పట్టించుకోవడం లేదు. అదే విధంగా పొలం యజమానులు పిచ్చి మొక్కలను తొలగించేందుకు నిప్పంటించడంతో కాలిపోయిన మొక్కల స్థానంలో పొలం యజమానులే కొత్త మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకుంటామని, పొలం యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వారికి నోటీసులు పంపించాలని సంబంధిత పంచాయతి కార్యదర్శులను ఆదేశించారు.