Monday, November 18, 2024

వీరనారి దుర్గావతి

- Advertisement -
- Advertisement -

తొలి స్వాతంత్య్ర సంగ్రామం నుండి ఆదివాసీలు పోరాడుతున్నారు. అందులో అదివాసీలకు చెందిన వీర వనితలు పాల్గొనడం విశేషం. మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లోని మదన్ మహల్ కొండల మీద మొగల్ రాజ్య స్థాపకుడు అక్బర్ పాదుషా సామ్రాజ్య కాంక్షకి ఒక వీరనారి ‘రాణి దుర్గావతి’ నేల కొరిగింది. జబల్‌పూర్ వనవాసి గోండు తెగకు చెందిన బుందే ల్ ఖండ్ సంస్థానాధీశుడైన చందవేల్ కు 1524, అక్టోబర్ 5న ఆమె జన్మించింది. దుర్గావతి భర్త దళపత్ సింహ్ జబల్‌పూర్, బుందేల్ ఖండ్‌లను గోండుల స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేసి పాలించాడు. దుర్గావతి యుద్ధ విద్యలో మంచి నేర్పరి. తన తండ్రి చందవేల్, భర్త దళపత్ సింహ్ రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని రాజ్యపాలన కొనసాగించింది.

గోండులు స్వతంత్ర రాజ్యంగా ఉండటం సహించలేని మొగల్ చక్రవర్తి అక్బర్ తన సేనాధిపతి ఆసిఫ్ ఖాన్ చేత కుట్ర పన్ని దళపతి సింహను కాల్చి చంపడంతో రాణి దుర్గావతి మదన్ మహల్ కొండలనే కేంద్రంగా యుద్ధ రంగంలో దిగి ప్రత్యక్ష పోరాటానికి పూనుకుంది.చిన్నతనం నుండే పౌరాణిక,చారిత్రక గాథల్ని వింటూ తన్మయత్వం పొందిన దుర్గావతి అస్త్ర శస్త్ర విద్యలలోనూ ఆరితేరింది. బుందేల్ ఖండ్‌ను గోండుల స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్న భర్త వారసత్వాన్ని నిలబెడుతూ ప్రజల్ని సుఖశాంతులతో వర్ధిల్లేలా పాలించింది. ఢిల్లీ పాదుషా అక్బర్ గోండులు స్వతంత్ర రాజ్యంగా ఉండటం సహించలేక దుర్గావతిని తనకు సామంతరాలుగా ఉండమని ఆసిఫ్ ఖాన్‌ను ఆజ్ఞాపిస్తాడు. అతడు గోండు రాజ్యం మీదకు దండెత్తే ప్రయత్నం చేస్తాడు.

ఆది నుండి స్వతంత్ర రాజ్యంగా విలసిల్లిన గోండు రాజ్యం ఒక్క తురక భూపతికి సామంత రాజ్యంగా మారడం అవమానకరమని, వనవాసుల ఉనికికి భంగకరమని భావించిన దుర్గావతి తన తండ్రివలే రాజ్యపాలన కొనసాగించి ‘దుర్గావతి అబల కాదు సబల’ అని నిరూపిస్తానని మొగల్ సైన్యానికి సవాల్ విసిరింది.దుర్గావతి తన గోండు సైన్యంతో మగ వేషం లో యుద్ధానికి దిగింది. గోండు సైనికులు, మంత్రులు, ప్రజలు మహారాణి యుద్ధంలో ప్రదర్శించిన శౌర్యానికి హర్షధ్వానాలు ప్రకటించారు. ఇలాగైతే జయం దుర్లభమన్న భావనతో అసిఫ్ ఖాన్ గోండుల కోటను ముట్టడించే వ్యూహ, ప్రతి వ్యూహాలు అతనికి ఫలించలేదు. అక్బర్ చక్రవర్తి సామ్రాజ్య కాంక్షో, గోండు వీరుల స్వాతంత్రేచ్చో తేలడం లేదు. హోరాహోరీగా జరుగుతున్న యుద్ధం లో దుర్గావతి వారసుడు సైతం ప్రవేశించి మొగలాయి సైనికుల్ని ఎత్తిన కత్తి దించకుండా వధించడం మొదలుపెట్టాడు.

ఆ బాల వీరాభిమన్యుడిని బాలుడని కనికరించి వదలిపెడితే సైన్యం అపారంగా నష్టపోతుందని మొగల్ సైనికులు బాలునిపై దొంగచాటు దెబ్బ తీయడంతో అతడు అమరుడయ్యాడు. ఆ దుర్వార్తకు సైతం తలొగ్గక ‘శత్రువున్ని వధించి, విజయం సాధించి, మన స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకోవడమే మన లక్ష్యం’ అని దుర్గావతి నినదించింది. గోండు వంశాంకురం నేలవాలినా యుద్ధాన్ని కొనసాగించమని ఆజ్ఞాపించిన దుర్గావతిని మెచ్చుకున్నాడు అసిఫ్ ఖాన్. దుర్గావతి ద్విగుణీకృతోత్సాహంతోనూ, యుద్ధ రంగంలో గోండులు బలహీనమైనా… మహా పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నారు. అప్పటికీ నీరసించి, గాయాల పాలైన దుర్గావతి తలకి బాణం తగిలింది. అయినా పోరాటాన్ని వీడలేదు. అంతిమంగా మొగలాయి సైనికులందరూ మూకుమ్మడిగా ఆమె పైకి విరుచుకుపడటంతో రణరంగం నుండి నిష్కృమించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

మొగల్ సైన్యం చేతిలో పరాభవం చూడలేక ఖడ్గానికి మొక్కిన వీరవనిత అదే ఖడ్గంతో తనని తాను పొడుచుకుని, యుద్ధ భూమిలోనే ప్రాణాల్ని విడిచింది. అది 1564 జూన్ 24. ఆ రోజున గోండు సైనికులు ఆ వీర నారీమణి దుర్గావతిని, ఆమె పుత్రుని శిబిరం వద్ద ఖననం చేశారు. గోండు రాజ్య సుపరిపాలన కోసం. మొగల్ సామ్రాజ్యాధిపతి అక్బర్‌ను ఎదుర్కొని వీర మరణం పొందిన భారతీయ ధీర వనిత రాణి దుర్గావతి. ఆమె ఆదిమ జాతికి చెందిన సమర యోధురాలు కావడమేనేమో భారతీయ వీర వనితల్లో ఆమెను, ఆమె పోరాట చరిత్రను పాలకులు విస్మరించడం గర్హ నీయం!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News