1827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
అనుమతులు మంజూరు చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని టీచింగ్ ఆసుపత్రుల్లో 1,827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ శుక్రవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మెడికల్ హెల్త్ అండ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే సిఎం కెసిఆర్ లక్ష్యాన్ని వేగంగా చేరుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 5 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 26కు చేరిందన్నారు. వచ్చే ఏడాదిలో మరో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీంతో పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ అవుతుండటంతో పాటు, తెలంగాణ బిడ్డలకు వైద్య విద్య చేరువ అవుతున్నదన్నారు. మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన వైద్యులను, నర్సులను, ఇతర సిబ్బందిని భర్తీ చేస్తున్నదని తెలిపారు. ఇప్పటికే 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి, వారిని టీచింగ్ ఆసుపత్రుల్లో నియమించుకోగా, ప్రస్తుతం 1,827 మంది స్టాఫ్ నర్సులను భర్తీ చేసుకోబోతున్నామని అన్నారు. దీంతో ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు. ఇప్పటికే 5,204 స్టాఫ్ నర్సుల నియామక ప్రక్రియను వైద్యారోగ్యశాఖ మొదలు పెట్టిన విషయ తెలిసిందే. తాజా ఉత్తర్వులతో 1,827 మందికి ఉద్యోగ అవకాశం కలుగనున్నది.