Thursday, September 19, 2024

డిఆర్‌ఎం భార్యను చెప్పులు వదలమన్నందుకు రైల్వే ఉద్యోగికి వస్త్రాపహరణం !

- Advertisement -
- Advertisement -

రాంచి: జార్ఖండ్‌లోని డివిజనల్ రైల్వే మేనేజర్(డిఆర్‌ఎం) చాంబర్‌లో ఒక అసాధారణ ఘటన ఇటీవల చోటుచేసుకుంది. దివిజనల్ రైల్వే ఆసుపత్రిలోని డాక్టర్ చాంబర్‌లోకి ప్రవేశిస్తున్న డిఆర్‌ఎం భార్యను బయట చెప్పులు వదిలి రమ్మన్మందుకు ఆసుపత్రి సిబ్బంది ఒకరిని డిఆర్‌ఎం తన చాంబర్‌లోకి పిలిపించి బట్టలు విప్పదీయించి అర్ధనగ్నంగా బయటకు పంపిన దారుణ సంఘటన సంభవించింది.

ఈ సంఘటనతో దిగ్భ్రాంతికి గురైన బాధిత ఆసుపత్రి ఉద్యోగి బసంత్ ఉపాధ్యాయ డిప్రెషన్‌లోకి జారుకోగా ఆయనను డివిజనల్ రైల్వే ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుంచి వేరే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఉపాధ్యాయ ఆసుపత్రి పాలవ్వడంతో ఆసుపత్రి సిబ్బంది శుక్రవారం డిఆర్‌ఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి వద్ద ధర్నా చేపట్టి ఓపీ సేవలకు ఆటంకం కల్పించారు.

తన చాంబర్‌లోకి చెప్పులు వేసుకుని ఎవరినీ అనుమతించరాదని ఆసుపత్రి డాక్టర్ తన సిబ్బందికి గట్టిగా ఆదేశాలు జారీచేయడమే ఈ వివాదానికి మూలమని తెలుస్తోంది. ఆసుపత్రిని తనిఖీ చేయడానికి వచ్చిన డిఆర్‌ఎం భార్య చెప్పులు వేసుకునే డాక్టర్ చాంబర్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడే ఉన్న ఆసుపత్రి ఉద్యోగి బసంత్ ఉపాధ్యాయ ఆమెను అడ్డుకున్నారు. చెప్పులు వదిలి లోపలకు వెళ్లాలని ఆమెకు చెప్పారు. అయితే ఉపాధ్యాయ మాటను పెడచెవినిపెట్టిన ఆమె చెప్పులతోనే లోపలకు వెళ్లారు. ఆ తర్వాత తన భర్త చాంబర్‌కు వెళ్లిన డిఆర్‌ఎం భార్య ఏం చెప్పారోకాని డిఆర్‌ఎం సిఎంఎస్‌ను, ఉపాధ్యాయను తన చాంబర్‌కు రావాలంటూ ఆదేశించారు.

ఉపాధ్యాయను వెంటపెట్టుకుని సిఎంఎస్ డిఆర్‌ఎం చాంబర్‌కు వెళ్లారు. తన భార్యను చెప్పులు విప్పమన్నందుకు ఉపాధ్యాయను దారుణంగా తిట్టిన డిఆర్‌ఎం అతని చేత బట్టలు విప్పించి అర్ధనగ్నంగా బయటకు పంపించివేశారు. అక్కడి నుంచి అలాగే ఆర్ధనగ్నంగా ఆసుపత్రికి చేరుకున్న ఉపాధ్యాయ డాక్టర్ ఆదేశాలను పాటించినందుకు తనకు ఇంతటి శిక్ష విధిస్తారా అంటూ తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడని ఆసుపత్రి ఉద్యోగి నివాస్ రావు వెల్లడించారు.

అయితే సీనియర్ డిసిఎం అమరేష్ కుమార్ మాత్రం డిఆర్‌ఎంపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. గ్నేయ రైల్వే ఉద్యోగుల మహిళా సంక్షేమ సంఘం(ఎస్‌ఇఆర్‌డబ్లుడబ్లు) అధ్యక్షురాలి పట్ల ఒక గ్రూపు డి ఉద్యోగి అమర్యాదకరంగా ప్రవర్తించినందుకు అతడిని తన చాంబర్‌కు పలిపించి డిఆర్‌ఎం మందలించారని అమ్రేష్ కుమార్ తెలిపారు. ఆ గ్రూపు డి ఉద్యోగి బట్టలు విప్పించి బయటకు పంపారన్న ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని ఆయన చెప్పారు. ఈ వ్యవహారం ప్రస్తుతం పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు. గురువారం ఈ సంఘటన జరిగితే శుక్రవారం ఆరోపణలు చేయడం వెనుక ఏదో కుట్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News