నాగర్‌కర్నూల్ : తల్లిదండ్రులు తమ పిల్లలలకు ఆస్తులు, అంతస్తులకన్నా ముఖ్యంగా ఙ్ఞానవంతమైన విద్యను అందించాలని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి అన్నారు. శనివారం తిమ్మాజిపేట మండల కేంద్రంలో 25 లక్షలతో ప్రాథమిక పశువైద్య కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన, ఎదిరేపల్లిలో మన ఊరు మన బడి పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు సరిగ్గా చెప్పరనే అపవాదు చాలా మంది తల్లిదండ్రుల్లో ఉందని, ప్రభుత్వ పాఠశాలల్లోనే ఙ్ఞానవంతమైన ఇంగ్లీష్ మీడియం విద్య అందుతుందని, ఇది తెలియకనే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివిస్తూ వేల రూపాయల ఫీజులు చెల్లిస్తున్నారని అన్నారు.
ప్రైవేట్ పాఠశాలల్లో బట్టి చదువులు తప్ప ఙ్ఞానవంతమైన విద్యను అందించడం లేదని, ప్రభుత్వ పాఠశాలల్లో సమర్థమైన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు పనిచేస్తున్నారన్నారు. వారి కృషి ఫలితంగానే ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయన్నారు. మంచి పాఠశాలలు, విద్యాబోధన, వసతులు, మంచి ఆహారం ఉంటే విద్యార్థులు ఉత్సాహంగా చదువుకుంటారని అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ కరువవడంతో తల్లిదండ్రులు కష్టపడి తమ పిల్లలను ప్రైవేట్‌కు పంపిస్తున్నారని తెలిపారు. వారి సంపాదన అంతా విద్య, వైద్యానికి ధారపోస్తున్నారని అన్నారు. ఆ దుస్థితి నుంచి విముక్తి కల్పిస్తే ప్రజలకు ఖర్చవడంతో పాటు వారి ఆదాయం పెరుగుతుందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు పెరిగాయన్నారు. ఆరోగ్యవంతమైన, ఙ్ఞానవంతమైన సమాజం నిర్మాణమవుతుందని, ఆలోచనతోనే తను 15 కోట్లు ఖర్చు చేసి 4 ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో బాగు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా సుధీర్ఘ కసరత్తు అనంతరం మన ఊరు మన బడి కార్యక్రమానికి కెసిఆర్ శ్రీకారం చుట్టారని వెల్లడించారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ బడుల మార్పుకు నాంధి అని అన్నారు. ప్రజలు ఆశించిన విధంగా ప్రజా ప్రతినిధులు పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ విద్యాలయాల బలోపేతం ద్వారా కార్పొరేట్ విద్యా సంస్థలకు చెక్ పెట్టవచ్చని వెల్లడించారు.
పేద, మధ్య తరగతి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను చేరువ చేయాలనే సంకల్పంతో కార్యక్రమం ముందుకు సాగుతుందన్నారు. పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసినట్లు అవుతుందన్నారు. పాఠశాలలపై పెట్టేది ఖర్చు కాదని, పెట్టుబడి మాత్రమేనని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు తప్పనిసరిగా గ్రామాల్లో తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలన్నారు.
అంతకు ముందు తిమ్మాజిపేట మండలంలోని గుమ్మకొండ గ్రామంలో 50 లక్షల రూపాయలతో కొత్తగా ప్రాథమికొన్న పాఠశాల భవనం నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం విద్యార్థులకు పాఠ్యప్తుసకాలు, స్కూల్ యూనిఫామ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి గోవిందరాజులు, ఎంపిపి రవీంద్రనాథ్ రెడ్డి, జెడ్పిటిసి దయాకర్ రెడ్డి, తహసిల్దార్ సరస్వతి, ఎంపిడిఓ కరుణశ్రీ, ఆయా గ్రామాల సర్పంచులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.