Monday, December 23, 2024

36 ఏళ్లుగా కవల సోదరుడి పిండాన్ని మోసిన వ్యక్తి

- Advertisement -
- Advertisement -

నాగ్‌పూర్ : మహారాష్ట్ర లోని నాగ్‌పూర్‌లో వైద్యశాస్త్రం లోనే అరుదైన ఘటన ఒకటి వెలుగు లోకి వచ్చింది. తనకు తెలియకుండానే తన కవల సోదరుడి పిండాన్ని 36 సంవత్సరాల పాటు కడుపులో మోశాడో వ్యక్తి. 1999 లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను “ ది డైలీస్టార్‌” పత్రిక తాజాగా తన కథనం ద్వారా వెల్లడించింది. నాగ్‌పూర్‌కు చెందిన సంజు భగత్ 1963లో జన్మించాడు. ఆయనకు 20 ఏళ్లు వయసు వచ్చేసరికి పొట్ట అసాధారణంగా పెరగడం ప్రారంభమైంది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా సంజు పొట్ట అలాగే ఉండడంతో కడుపుతో ఉన్నట్టు స్థానికులు గేలి చేసేవారు. రానురాను పొట్ట మరింత ఉబ్బెత్తుగా మారి, శ్వాస తీసుకోవడం కష్టం కావడంతో 1999లో ముంబై లోని ఓ ఆస్పత్రికి వెళ్లాడు.

అక్కడ సంజును పరీక్షించిన వైద్యులు కడుపులో కణితి ఉందని, శస్త్ర చికిత్సచేయాలని డాక్టర్ అజయ్ మెహతా చెప్పారు. శస్త్రచికిత్స ప్రారంభించిన కాసేపటికి భారీ క్యాన్సర్ కావచ్చని అనుకున్నారు. తీరా పొట్టలో ఉన్నది చూశాక ఒక్కసారిగా డాక్టర్లు షాక్ అయ్యారు. మనిషి అవయవాలు ఒకటొకటిగా బయటకు రావడం మొదలు పెట్టాయి. ఇది నిజమా, కలా అని తెలుసుకోడానికి పక్కనున్న వారితో కరచాలనం చేశానని డాక్టర్ అజయ్ మెహతా ఆనాటి అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. 36 ఏళ్లుగా తన కవల సోదరుడి పిండం సంజు భగత్‌లో ఉన్నట్టు గుర్తించారు. దీన్నే వైద్య పరిభాషలో “ ఫీటస్ ఇన్ ఫీట్ ” ( పిండంలో పిండం ) అంటారు.

ఐదు లక్షల మందిలో ఒకరికి ఇలా జరిగే అవకాశం ఉందని డాక్టర్ మెహతా వివరించారు. ఇది చాలా అరుదైన కేసు. ఒక వైకల్య సకశేరుక పిండం తన కవల సోదరుడి దేహంలో ఉండిపోయిందన్న మాట. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం ఇటువంటి కేసులు వందకు లోపే ఉంటాయి. సంజు భగత్‌కు ఇప్పుడు 60 ఏళ్లు కాగా, ఆయన ఆరోగ్యంగా ఉన్నారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News