Monday, December 23, 2024

హత్య కుట్రను భగ్నం చేసిన ఫలక్‌నుమా పోలీసులు

- Advertisement -
- Advertisement -

చాంద్రాయణగుట్ట: తన భార్యకు మంత్రాలు చేయించాడని…ఆమెతో చనువుగా ఉంటున్నాడని…సంతానం లేదంటూ ప్రచారం చేస్తున్నాడని…ఇలా తనను వేధిస్తున్న వరుసకు సోదరుడి (తోడల్లుడు)ని హత్య చేసే నేరపూరిత కుట్రను ఫలక్‌నుమా పోలీసులు భగ్నం చేశారు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులకు పట్టుబడటంతో వారి ప్రయత్నం బెడిసికొట్టింది. దీంతో ముఠాలోని నలుగురు జైలు పాలైయ్యారు. మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నారు. ఆదివారం ఫలక్‌నుమా పోలీసు కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదనపు డీసీపీ, ఫలక్‌నుమా ఇంచార్జ్ ఏసీపీ షేక్ జహంగీర్, ఇన్‌స్పెక్టర్ ఎస్.రాఘవేంద్రలతో కలిసి దక్షిణ మండల డీసీపీ పి.సాయి చైతన్య వివరాలు వెల్లడించారు. ఫలక్‌నుమా ఫారూక్‌నగర్‌కు చెందిన మీర్ అష్ఫక్ అలీ ఎలియాస్ ఆమేర్ ఖాన్ (27) చార్మినార్ లాడ్‌బజార్‌లో వ్యాపారం చేస్తున్నాడు. కొన్ని నెలల కిందట వరుసకు సోదరుడు కందికల్‌గేట్‌కు చెందిన ఆటోడ్రైవర్ నిజామ్ ఎలియాస్ ఇషాన్ (35)తో స్వల్ప విషయమై గొడవ జరిగింది. ఆ సమయంలో ఆమేర్, నిజామ్‌పై చేయి చేసుకున్నాడు.

దీంతో నిజామ్, ఆమేర్‌పై కక్ష పెంచుకున్నాడు. ఆమేర్‌కు సంతానం లేదంటూ నిజామ్ స్థానికంగా అతనిపై ప్రచారం చేస్తున్నాడు. అంతేకాకుండా ఆమేర్‌తో అతని భార్య గొడవ పడుతుండటం వెనుక ఆమెకు నిజామే మంత్రాలు చేయించి ఉంటాడని అనుమానిస్తున్నాడు. ఎలాగైన నిజామ్‌ను అంతమొందించేందుకు ఆమేర్ పథకం వేశాడు. తన స్నేహితులు కాలాపత్తర్ ఘాజీబండకు చెందిన డెంటర్ మహ్మద్ సుబాన్ ఖాన్ (19), సరూర్‌నగర్ భగత్‌సింగ్ నగర్‌కు చెందిన కార్పెంటర్ ముహమ్మద్ జమీల్ ఖాన్ (19)లతోపాటు ఫర్హాన్, ఇమ్రాన్, చోటా ఫర్హాన్, ఒక బాల నేరస్థుడితో కలిసి హత్యకు వ్యూహం రచించాడు. ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో ఆమేర్‌ఖాన్, మహ్మద్ సుబాన్‌ఖాన్, ముహమ్మద్ జమీల్ ఖాన్, బాల నేరస్థుడు కలిసి ఫలక్‌నుమా నాగులబండ జైతూన్ హోటల్ వద్ద మాటు వేశారు.

విశ్వసనీయ సమాచారం మేరకు ఇన్‌స్పెక్టర్ ఎస్. రాఘవేంద్ర, ఎస్సైలు బి.రవి కుమార్, ఎం.నాగరాజు, కానిస్టేబుళ్లు మహ్మద్ రియాజుద్దీన్, ఇఎస్.వినయ్, బి.శివలు ఉన్నఫళంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు వేట కొడవళ్లు, మూడు కత్తులు, రెండు సెల్‌ఫోన్లు, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను విచారించగా హత్య కోణం బయటపడింది. ప్రధాన నిందితుడు ఆమేర్‌ఖాన్ తనకు వరుసకు సోదరుడైయ్యే నిజామ్ ఎలియాస్ ఇషాన్‌ను హత్యచేసేందుకు పథకం వేసినట్లు వెల్లడైయ్యింది. దీంతో పోలీసులు బాల నేరస్థుడితో సహా నల్గురు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న ఫర్హాన్, ఇమ్రాన్, చోటా ఫర్హాన్ల కోసం గాలిస్తున్నారు. హత్య కుట్రను భగ్నం చేసిన పోలీసు సిబ్బందిని డీసీపీ నగదు పురస్కారంతో అభినందించారు. కేసు దర్యాప్తులో ఉంది. కాగా నేరాలకు సంబంధించి ముందస్తు సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని డీసీపీ సాయి చైతన్య కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News