Tuesday, November 5, 2024

జూలైలో బస్సు యాత్ర ద్వారా టిటిడిపి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం

- Advertisement -
- Advertisement -
వీలైనన్నీ ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా రూట్ మ్యాప్
ఈ యాత్రతో డిసెంబర్‌లో జరిగే ఎన్నికలకు పార్టీ కేడర్ సన్నద్ధం
అవరమైన చోట అభ్యర్థులను ప్రకటిస్తాం
బస్సు యాత్రలోపే గ్రామస్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం పూర్తి చేస్తాం
తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ వెల్లడి

మనతెలంగాణ/హైదరాబాద్: జూలైలో ప్రారంభించనున్న బస్సు యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయాత్తం చేయడమే ఈ బస్సు యాత్ర ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ఆదివారం టిడిపి రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో భువనగిరి, మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నాయకులతో జ్ఞానేశ్వర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుతూ బస్సు యాత్రకు రూట్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు. తుది కసరత్తు పూర్తయ్యాక రూట్ మ్యాప్‌తో కూడిన బస్సు యాత్ర షెడ్యూల్‌ను ప్రకటిస్తామన్నారు. సాధారణ ఎన్నికలు డిసెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉన్నందున ఈ బస్సు యాత్ర నుంచే టిడిపి పార్టీ కేడర్ ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ఈ బస్సు యాత్రను ప్లాన్ చేస్తున్నామని, వీలైనన్నీ ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా చూస్తామన్నారు. బస్సు యాత్రలో రాష్ట్ర ముఖ్య నేతలతో పాటు ఆయా జిల్లాల, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. బస్సు యాత్రలోనే పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీలో ఉండే అభ్యర్థులను ప్రకటిస్తామని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు.

భువనగిరి, మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుల నియామకం
తెలుగుదేశం పార్టీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడి గా కుందారపు కృష్ణామాచారి, మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడిగా మెట్టుకాడి శ్రీనివాస్‌లను కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నియమించారు. ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు పూర్తిస్థాయి పార్టీ కార్యవర్గాన్ని సైతం ఆయన ప్రకటించారు. ఈ సమావేశంలో జాతీయ క్రమశిక్షణ సంఘం సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్, రాష్ట్ర మీడియా కో- ఆర్డినేటర్ బియ్యని సురేష్, రాష్ట్ర కార్యదర్శి రాపోలు నర్సింహా, జిలమోని రవీందర్, భువనగిరి పార్లమెంటు అధ్యక్షుడు ఎన్.కృష్ణమాచారి, మహబూబ్నగర్ పార్లమెంటు అధ్యక్షుడు మెట్టుకాడి శ్రీనివాస్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిలు ఆకారపు రమేష్(తుంగతుర్తి), యాతాకుల అంజయ్య(నకిరేకల్), చింతకింది చక్రపాణి(ఇబ్రహీంపట్నం), సామల వెంకట ప్రసాద్ (కొడంగల్), జనార్ధన్ నాయుడు(దేవరకద్ర), జి.సత్యం గౌడ్(జడ్చర్ల), కాటెకేలి తిమ్మప్ప (మక్తల్), వినయ్ మిత్ర యాదవ్ (నారాయణపేట), అసెంబ్లీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు మన్నే సంజీవరావు(భువనగిరి), రేగు బాలనర్సింహా(ఆలేరు), తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News