హైదరాబాద్ : టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు పెను దుమారం రేపుతోంది. డ్రగ్స్ కేసులో పోలీసులకు చిక్కిన కబాలి సినీ నిర్మాత కెపి చౌదరి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసుతో ఇద్దరు యువనటులకు సంబంధం ఉన్నట్టు ప్రచారం జరగడం కలకలం రేపుతోంది. కేపీ చౌదరి పోలీస్ కస్టడీ ముగిసిన తర్వాత అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. ఫోన్ కాల్స్, ఫొటోలను పరిశీలించాక అనేక మంది పేర్లు రావడం కలకలం రేపుతోంది. పలువురు సినీ తారలతో ఎక్కువగా ఫోన్ మాడినట్లు తెలుస్తోంది. కెపి చౌదరి దందా, ఆయన వద్ద డ్రగ్స్ కొన్నవారి లిస్ట్, బ్యాంకు ట్రాన్సక్షన్స్, ఫోన్ సంబాషణలు, వాట్సాప్ చాటింగ్‌లు, డ్రగ్స్ పార్టీల ఫొటోలు వీటన్నింటిని తన గూగుల్ డ్రైవ్‌లో సేవ్ చేసుకున్నాడు. వీటిని వెలికితీసిన పోలీసులు అందులో ఉన్న ఆధారాల మేరకు పలువురు సెలబ్రిటీలకు, ఇతర వ్యక్తులకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
ఈనెల 14వ తేదీన కెపి చౌదరి గోవా నుంచి హైదరాబాద్‌కు 100 గ్రాముల కొకైన్ తీసుకురాగా, అందులో 12 గ్రాముల కొకైన్ ను విక్రయించారని పోలీసులకు వివరించారు. దానిని ఎవరికి అమ్మాడనేది తేల్చడంపై పోలీసులు దృష్టి పెట్టారు. మిగతా 88 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఈ వ్యవహరంలో తమకు సంబంధం లేదంటున్నారు పలువురు నటీమణులు. అషురెడ్డి, జ్యోతి, సురేఖా వాణి వంటి వారంతా తమపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. తమ ఫోన్ నెంబర్లను బహిరంగంగా పోస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మీరు చేస్తున్న ఆరోపణలు వల్ల మా కెరీర్, మా పిల్లల భవిష్యత్తు, మా కుటుంబం, మా ఆరోగ్యం అన్నింటిపైనా ప్రభావం పడుతుంది. దయ ఉంచి ఇలాంటి ప్రచారాలు చేయవద్దు, మమ్మల్ని అర్థం చేసుకోండి ప్లీజ్’ అంటూ ఓ వీడియో ద్వారా చేతులు జోడించి నటి సురేఖవాణి తెలిపారు.
ఓ క్రీడాకారిణి నివాసంలో డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న విషయాన్ని అషురెడ్డి వద్ద ప్రస్తావించగా. కొద్ది రోజులు క్రితం అద్దె కోసం కెపి చౌదరి ఇంటిని అడిగానని చెప్పుకొచ్చారు. అంతే తప్ప ఆ ఇంట్లో వారు ఏం చేశారనేది తనకు తెలియదని చెప్పారు.