Sunday, December 22, 2024

ఎఐసిసి పిలుపు మేరకు దిల్లీకి హస్తం నేతలు క్యూ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు దిల్లీ రావల్సిందిగా ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చింది. ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావు థాక్రే, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎఐసిసి కార్యదర్శులు రోహిత్ చౌదరి, మన్సూర్ అలీఖాన్, పీసీ విష్ణునాథ్‌లతోపాటు ఎంపీలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంఎల్‌సి జీవన్ రెడ్డి, మాజీ మంత్రులు నాగం జనార్ధన్ రెడ్డి, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ హస్తినకు వెళ్లారు. వీరితో పాటు కేంద్ర మాజీ మంత్రులు రేణుకా చౌదరి, బలరాం నాయక్, ఎఐసిసి కార్యదర్శులు శ్రీధర్ బాబు, సంపత్‌కుమార్, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ గౌడ్, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ పిసిసి అధ్యక్షుడు వి.హనుమంతరావు, ఎంఎల్‌ఎలు పొదెం వీరయ్య, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, మాజీ ఎంఎల్‌ఎ సుదర్శన్ రెడ్డి తదితరులు సోమవారం రాహుల్ గాంధీ సమావేశంలో పాల్గొనేందుకు ఎఐసిసి నుంచి ఆహ్వానం అందింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఏఐసీసీ కార్యాలయానికి చేరుకోవాలని ఎఐసిసి సదరు నేతలకు స్పష్టం చేసింది.

రాహుల్, ప్రియాంక, ఖర్గేలతొ సమావేశమవ్వనున్న పొంగులేటి, జూపల్లి
సోమవారం మధ్యాహ్నం జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌లు సమావేశం అవుతున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల ముఖ్యనాయకులతో పాటు సీనియర్ నాయకులను హస్తినకు పిలిచారు.

జగ్గారెడ్డికి దక్కని ఆహ్వానం
ఇందులో ఎంఎల్‌ఎ, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, సిఎల్‌పి నేత భట్టి విక్రమార్కలకు ఆహ్వానం అందనట్లు తెలుస్తోంది. భట్టి విక్రమార్క పాదయాత్రలో ఉండడంతో ఆయనను పిలువకపోగా మిగిలిన ఇద్దరిని ఎందుకు ఆహ్వానించలేదో తెలియడం లేదు. ఎంతో కాలంగా పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న వారికి జూపల్లి, పొంగులేటి చేరికతో నష్టం వాటిళ్లకుండా అధిష్ఠానం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇంకా బిఆర్‌ఎస్, బిజెపి నుంచి మరికొంత మంది నాయకులు కాంగ్రెస్‌లోకి చేరడానికి ఆసక్తిగా ఉన్నారని సమాచారం.

జూలై 2న ఖమ్మంలో సభ.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక అప్పుడే…
జులై 2న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి, రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించనుంది. ఇప్పటికే సభావేదికను సిద్ధం చేస్తున్నారు. ఇందుకు తగిన భారీ జన సమీకరణ, నియోజకవర్గాల వారీగా సన్నాహకాలను చేస్తున్నారు. ఆ తర్వాత మహబూబ్‌నగర్‌లో సభ నిర్వహించి జూపల్లిని కూడా పార్టీలోకి ఆహ్వానించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News