Sunday, January 19, 2025

సూపర్ సిక్స్‌కు లంక

- Advertisement -
- Advertisement -

బులవాయో: వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్‌లో శ్రీలంక హ్యాట్రిక్ విజయంతో సూపర్ సిక్స్‌లో అడుగు పెట్టింది. ఆదివారం జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో లంక 133 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై జయం సాధించడంతో సూపర్ సిక్స్ అర్హత సాధించింది. . తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక దిముత్ కరుణరత్నె (103 బంతుల్లో 103) సెంచరీతో చెలరేగడంతో 49.5 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌటైంది. కరుణరత్నెతో పాటు సదీర సమరవిక్రమ(82), ధనంజయ డిసిల్వా (42 నాటౌట్), చరిత్ అసలంక (38) బ్యాట్ చెలరేగారు. ఐర్లాండ్ బౌలర్లలో మాక్క్ ఎడైర్ (4/46), బారీ మెకాతీ (3/56) సత్తా చాటారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్ 31 ఓవర్లలో 192 పరుగులకే చాపచుట్టేసింది.

వానిందు హసరంగ (5/79) బాల్‌తో రాణించడంతో ఐర్లాండ్ బ్యాటర్లు ఎవరూ క్రీజులో నిలువలేకపోయారు. కర్టిస్ క్యాంఫర్(39), హారీ టెక్టర్ (33), జార్జ్ డాక్రెల్ (26) తప్ప మిగతా ఆటగాళ్లు నిరాశ పరిచారు. హసరంగకు తోడు మహేశ్ పతిరణ రెండు వికెట్లు పడగొట్టారు. కరుణరత్నెకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. వరుసగా మూడో ఓటమితో ఐర్లాండ్ గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టగా, మరో మ్యాచ్ మిగిలుండగానే శ్రీలంక సూపర్ సిక్స్ బెర్తు ఖాయం చేసుకుంది.
హసరంగా నయా రికార్డు..
స్పిన్నర్ వనిందు హసరంగ నయా రికార్డు నెలకోల్పాడు. వరుసగా ఐదు వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. హసరంగ 5 వన్డేల్లో 22 వికెట్లు పడగొట్టాడు. దాంతో, పాకిస్థాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ 33 ఏళ్ల క్రితం నెలకొల్పిన రికార్డును సమం చేశాడు. కాగా, 10 ఓవర్లు వేసిన హసరంగ 79 పరుగులిచ్చిన హసరంగా ఐదు వికెట్లు తీశాడు. అంతేకాదు వరుసగా మూడు వన్డేల్లో ఐదేసి వికెట్లు తీసిన మొట్ట మొదటి స్పిన్నర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News