గన్‌ఫౌండ్రీ ః రామాయణానికి,రామనామానికి ఉన్న శక్తుల దృష్ఠా ,ఆదిపురుష్ సినిమాలోని కొన్ని పాత్రలను వక్రీకరించడం సరైనది కాదని అయ్యప్ప కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు డా.మధుబాబు పేర్కొన్నారు. ఈమేరకు ఆదివారం ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మధుబాబు మాట్లాడుతూ నేటితరానికి తగిన విధంగా నిర్మించిన చిత్రం ఆదిపురుష్ అన్నారు. ఆదిపురుష్ చిత్రంలోని పాత్రల రూపకల్పనలో కొన్ని పొరపాట్లు ఉన్నప్పటికి, రామాయణం మూల కథ మాత్రం వక్రీకరించ బడలేదని అన్నారు. మహాసాధ్వి సీతను గత చిత్రాలకు భిన్నంగా చిత్రదర్శకుడు ఓం రావత్ మలిచిన తీరుకు మహిళాలోకం నీరాజనం పలకాల్సిన అవసరం ఉందన్నారు.
సీతలోని ఆత్మస్థైర్యం, అంకుఠిత దీక్ష, పట్టుదల నేటి తరం మహిళలకు ఆదర్శమని చెప్పారు.రాముని ఔచిత్యాన్ని,సీతమ్మ అహర్యాన్ని పిల్లలకు అర్థమయ్యేలా చందమామ కధలులాగా నిర్మించిన తీరుకు అందరం మంత్రముగ్థులం అవ్వాలని పేర్కొన్నారు.ఈ చిత్రం గొప్పతనాన్ని లోతుగా అధ్యయనం చేసిన వారికి, ప్రతిపాత్ర పరమపద సోపాయమానంగా ఉంటుందని స్పష్టం చేశారు.ఈసమావేశంలో కార్యదర్శి వెంకటరమణ,సభ్యులు ఇమాన్యువేల్ పాల్గొన్నారు.