బాలాపూర్:బడంగ్‌పేట్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్‌గూడ కోమటికుంట చెరువు అవుట్‌లెట్ పనులను వారం రోజుల్లో ప్రారంభించకపోతే ప్రజలతో కలిసి పెద్దఎత్తున ఉద్యమం చేపడుతామని స్ధానిక 3వ డివిజన్ కార్పొరేటర్ రామిడి మాధురివీరకర్ణారెడ్డి హెచ్చరించారు.గ్రామంలోని అధికార బిఆర్‌ఎస్‌పారటీ కార్పొరేటర్లు తమ స్వార్ధప్రయోజనాల కోసం చెరువు డ్రైనేజి మ్యాన్‌హోల్‌కు రాత్రికిరాత్రే గండి కొట్టడంతో దిగువన ఉన్న సివైఆర్,సిఎంఆర్‌కాలనీల్లోని ఇండ్లల్లోకి మురుగునీరు వచ్చి చేరిందని మండిపడ్డారు.బిజెవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామిడి శూరకర్ణారెడ్డి,ఆయా కాలనీల వాసులతో కలిసి కోమటికుంట శివాజీవిగ్రహం వద్ద గండికొట్టిన ప్రదేశాన్ని ఆదివారం పరిశీలించిన అనంతరం కార్పొరేటర్ రామిడి మాధురి జెసిబి సహాయంతో గండిని మట్టితో పూడ్చివేయించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎగువన ఉన్న బస్తీలు ముంపుకు గురికాకుండా ఉండేందుకు దిగువన ఉన్న కాలనీలు మురుగునీటిలో మునిపోయే విధంగా అర్ధరాత్రి దొంగల తరహాలో చెరువుకు అక్రమంగా గండి కొట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.అదేవిధంగా చెరువులో కలుస్తున్న మురుగునీటిని ఎట్టిపరిస్ధితుల్లో దిగువకు రానిచ్చే ప్రసక్తే లేదని అవసరం అయితే అధికార పార్టీపై ఎంతటి పోరాటానికైనా తాను సిద్ధంగా ఉన్నానని కార్పొరేటర్ మాధురి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సివైఆర్,సిఎంఆర్‌కాలనీల వాసులు పాల్గొన్నారు.