కల్వకుర్తి రూరల్ : తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతుందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, గ్రామాలకు మౌళిక వసతులు కల్పన తదితర అంశాలలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఎనలేని కృషి చేస్తూ తెలంగాణ అభివృద్ధి ప్రధాతగా నిలిచారని ఎమ్మెల్యే అన్నారు. ఆదివారం కల్వకుర్తిలో ఎమ్మెల్యే పర్యటించారు.
= నెరవేరిన ఆమన్‌గల్ రైతుల కష్టాలు
ఆమన్‌గల్, మాడుగుల, తలకొండపల్లి, కడ్తల్ మండలాల రైతుల కష్టాలు తీరనున్నాయి. ఆమన్‌గల్ మున్సిపాలిటీ కేంద్రంలో అదనపు వ్యవసాయ అధికారి కార్యాలయం ఏర్పాటుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమన్‌గల్, తలకొండపల్లి, మాడుగుల, కడ్తాల్ మండలాలకు చెందిన రైతులు హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే- క్యాంపు కార్యాలయంలో కలిసి ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో ఆమన్‌గల్ మండల కేంద్రంలో ఏడిఏ కార్యాలయం ఏర్పాటు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
= దుందుభి వాగుపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు
కల్వకుర్తి మండల కేంద్రం నుంచి రఘుపతిపేట మీదుగా తెలకపల్లి, లింగాల, నాగర్‌కర్నూల్ ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజల కష్టాలు తీరనున్నాయి. దుందుభి వాగుపై వంతెన నిర్మాణానికి 45 కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రి కెసిఆర్ మంజూరు చేశారని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు.
వర్షాకాలంలో దుందుభి వాగు ప్రవహించడంతో రఘుపతిపేట నుంచి తెలకపల్లి, నాగర్‌కర్నూల్ ఇతర ప్రాంతాలకు వెళ్లే రైతులకు, ప్రయాణికులకు దుందుభి వాగుపై వచ్చే వరద వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రానున్న రోజుల్లో వంతెన నిర్మాణం జరగడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లే కల్వకుర్తి మండల ప్రజల కష్టాలు తీరనున్నాయని ఆయన పేర్కొన్నారు.
= వంద పడకల ఆసుపత్రికి స్థల సేకరణ వెంటనే చేయాలి
కల్వకుర్తి మున్సిపాలిటీ కేంద్రంలో నూతనంగా నిర్మించే వంద పడకల ఆసుపత్రికి స్థల సేకరణ వెంటనే చేయాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులను ఆదేశించారు. వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి కెసిఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అనుమతి ఇచ్చారని నిధులు కూడా త్వరలో మంజూరవుతాయని ఆయన అన్నారు.
కల్వకుర్తి ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టణంలో నాలుగు ఎకరాల స్థలాన్ని సేకరణ చేయాలని ఆయన అన్నారు. మండల వైస్ ఎంపిపి కొండూరు గోవర్ధన్ గుప్తా, పిఎసిఎస్ చైర్మెన్ బన్ని శ్రీనివాస్ యాదవ్, కల్వకుర్తి కౌన్సిలర్ సూర్య ప్రకాష్ రావు, మనోహర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జమ్ముల శ్రీకాంత్, కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శివరాం, వైద్యులు సందీప్ పండు యాదవ్, రాచూర్ ఎంపిటిసి గుత్తి వెంకటయ్య, పలువురు నాయకులు పాల్గొన్నారు.