ఢిల్లీ: ప్రాంతీయ పార్టీ పెట్టడంపై అభిప్రాయ సేకరణ చేశామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పొంగులేటీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, ఎఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సమావేశామయ్యారు. అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడారు. కొత్త పార్టీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని భావించామన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందనే ప్రాంతీయ పార్టీ పెట్టలేదన్నారు. భవిష్యత్తు కార్యాచరణపై ఎందరో మేధావులతో చర్చించామని, ప్రాంతీయ పార్టీ పెట్టడం కంటే ఏదో పార్టీలో చేరాలని మేధావులు సూచించారన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర కాంగ్రెస్ గ్రాఫ్ పెంచిందన్నారు. కర్నాటక విజయంతో కాంగ్రెస్ మరింత పుంజుకుందని, తెలంగాణలో బిజెపి పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని, సిఎం కెసిఆర్‌ను గద్దె దించాలంటే గట్టి పార్టీతో ప్రయాణించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
Also Read: కాంగ్రెస్ గూటికి పొంగులేటి, జూపల్లి
సిఎం కెసిఆర్ స్కీముల పేరుతో మాయ చేస్తున్నారని, గారడీలు చేయడంలో కెసిఆర్ సిద్ధహస్తుడు అని పేర్కొన్నారు. అన్ని పరిణామాలు బేరీజు వేసుకున్న తరువాత రాహుల్‌ను కలవాలని నిర్ణయం తీసుకున్నామని పొంగులేటి చెప్పారు. తెలంగాణ ఇచ్చినందుకు ప్రజలు కాంగ్రెస్‌కు రుణపడి ఉన్నారని, ఎపిలో పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా కూడా తెలంగాణ ఇచ్చారని, మాయమాటలు చెప్పి ఉంటే 2014లోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదన్నారు. మాయమాటలతో కెసిఆర్ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చారని, ఆరు నెలల విశ్లేషణ తరువాత కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నామని, కొంతకాలంగా తాను, జూపల్లి కృష్ణా రావు అనేక చోట్ల ఆత్మీయ భేటీలు నిర్వహించామన్నారు. కొంతకాలంగా తాను తెలంగాణలోని పరిస్థితులపై సర్వేలు చేయించామన్నారు. జులై 2న ఖమ్మంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతామని పొంగులేటి ప్రకటించారు.