యాదాద్రి భువనగిరి : యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని యాదాద్రి భువనగిరి జిల్లా డిప్యూటీ కమిషనర్ ఎం రాజేష్ చంద్ర సూచించారు. సోమవారం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినీ విద్యార్థులకు మాదక ద్రవ్య రహిత తెలంగాణ నిర్మాణానికి మిషన్ పరివర్తన పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్ చంద్ర మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా వుండాలని, మాదక ద్రవ్యాల వలన జీవితాలు అంధకారమవుతాయని, వాటి దుష్ప్రభావాల వలన పట్టణ కేంద్రాల నుండి గ్రామీణ కేంద్రాల వరకు మాదక ద్రవ్యాల వినియోగం, వ్యసనాల పట్ల నేటి సమాజం, జరుగుతున్న సంఘటనల గురించి తెలియచేస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించారు.
మాదక ద్రవ్యాలు వినియోగించినా, విక్రయించినా శిక్షకు అర్హులు అవుతారని అన్నారు. జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కే నవీన్ కుమార్ మాట్లాడుతూ.. గంజాయి వంటి మత్తు పదార్ధాలను పండించడం, వాటిని అక్రమంగా రవాణ చేయడం తప్పని తెలుపుతూ మత్తు పదార్దాలకు బానిసలైన వారు దొంగతనాలు, అత్యాచా రాలు, హత్యలు చేయడానికి కూడా ఆస్కారం వుందని, అంతే కాకుండా చదువుల్లో వెనుకబడడం, కుటుంబంలో కలహాలు, సమాజం లో గంజాయి వినియోగించే వారికి, వారి కుటుంబానికి గౌరవం లేకుండా పోవడం జరుగుతుందని, ఎవరు కూడా ఇలాంటి వ్యసనాల జోలికి పోవద్దని అన్నారు.
జిల్లా ఇన్ఛార్జీ మహిళా శిశు సంక్షేమ అధికారి జి.అన్నపూర్ణ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాలకు వ్యతిరేకంగా ప్రతి సంవత్సరం జూన్ 26 న అ ంతర్జాతీయ దినోత్సవంగా నిర్వహించడం జరుగుతున్నదని, మాదక ద్రవ్యాల దుర్వినియోగం లేని అంతర్జాతీయ సమాజాన్ని సాధించాలనే లక్ష్యంతో అందరి సహకారం బలోపేతం చేయాలనే సంకల్పానికి ఐక్యరాజ్య సమితి ఈరోజున పాటిస్తున్నదని తెలియచేస్తూ మాదక ద్రవ్యాల నిరోధంపై ప్రతిజ్ఞ చేయించి ర్యాలీ నిర్వహించారు.
ఈకార్యక్రమంలో భువనగిరి ఎంపిపి నరాల నిర్మల వెంకటస్వామి, జడ్పీటిసి సుబ్బూరు బీరు మల్లయ్య మాట్లాడుతూ యువత మత్తు పదార్దాల బారినపడకుండా తల్లిదండ్రులు తమ బాధ్యత వహించి చెడు అలవాట్లకు పోకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లా ఉప వైద్య అధికారి డాక్టర్ యశోద మాట్లాడుతూ మాదక ద్రవ్యాల బారినపడిన వారికి జిల్లా ఆసుపత్రిలో కౌన్సిలింగ్ ఇస్తూ వారి ప్రవర్తనలో మార్పు రావడానికి ఎళ్లవేళలా అందుబాటులో వుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి రమణి,కళాశాల ప్రిన్సిపల్ పాపిరెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ శశికళ, సీనియర్ అసిస్టెంట్ సోమేశ్, నరేశ్, పోషణ అభియాన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.