నల్గొండ : జూలై 1న నిర్వహించే గ్రూప్-4 పరీక్షల నిర్వహణపై పూర్తి అవగాహనతో సమర్ధవంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్‌లో గ్రూప్ 4 పరీక్షా కేంద్రాల రూట్ అధికారులు, చీఫ్ సూపరిండెంట్లు, లైజన్ అధికారులతో గ్రూప్-4 పరీక్షల నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించి సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పరీక్షల నిర్వహణకు 188 కేంద్రాలను ఏర్పాటు చేశామని, 53,123 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. జులై 1 న జరిగే పరీక్షలు ఉదయం 10 గంటల నుండి 12.30 వరకు, మధ్యాహ్నం 2.30 నుండి 5.00 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. టిఎస్పిఎస్సి నియమ నిబంధనలు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా పాటించాలన్నారు. పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లు, వాచ్‌లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌కు అనుమతి లేదని, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను పరీక్షా కేంద్రాలకు అనుమతించే ముందు వారి వద్ద సెల్ ఫోన్లు, వాచ్ లు, క్యాలుకులెటర్లు, బ్లూ టూత్, పెన్ డ్రైవ్ లు, హియరింగ్ ఎయిడ్స్ ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేకుండా క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించాలన్నారు.
అభ్యర్థులు షూ ధరించి రావద్దని, చెప్పులు ధరించి రావాలని, అభ్యర్థుల తో పాటు ఇన్విజిలేటర్లకు కూడా సెల్ ఫోన్ అనుమతిం చవద్దన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఐడి కార్డ్, హాల్ టికెట్ లేకుండా అభ్యర్థులను ఎవ్వరినీ అనుమతించ వద్దని స్పష్టం చేశారు. చీఫ్ సూపరింటెండెంట్స్, లైజన్ ఆఫీసర్లు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ముందుగా కేటా యించిన పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షా కేంద్రంలో కనీస వసతులు త్రాగు నీరు, విద్యుత్ సౌ కర్యం, ఫ్యాన్లు, ఫర్నిచర్, టాయిలెట్లు, సిసి కెమెరాలు పనితీరును పర్యవేక్షించాలన్నారు. అభ్యర్థులకు ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్ షీట్లను ఇచ్చే సమయంలో అభ్యర్థులకు బబ్లింగ్ విధానంపై అవగాహన కల్పించాలన్నారు.
ఉర్దూ మీడియం అభ్యర్థులకు ప్రత్యేకంగా గదిలో సీటింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరీక్ష సమయం ముగిసే 15 నిమిషాల ముందు అభ్యర్థి ఎడమ వేలి ముద్ర నామినల్ రోల్ పై తీసుకోవాలని సూచించారు. దివ్యాంగులకు భవనంలో క్రింద ఫ్లోర్‌లో ఉన్న గదులు కేటాయించాలన్నారు. జిల్లా ఎస్పీ అపూర్వ రావు మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందో బస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పరీక్ష రోజున పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్, జీరాక్స్ కేంద్రాలు మూసి వేయనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను తనిఖీ చేసి పంపించాలని, మహిళా అభ్యర్థినిలను తనిఖీ చేయడానికి మహిళలను నియమించాలని సూచించారు. సమావేశం లో అదనపు ఎస్పీ కెఆర్కె ప్రసాద రావు, ఆర్డీఓ లు చెన్నయ్య, గోపి రాం నాయక్, డీఎస్పీలు, రూట్ ఆఫీసర్లు, లైజన్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.