ఖమ్మం : గ్రీవెన్స్ డేలో అందిన దరఖాస్తుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి సమావేశ మందిరంలో పలు సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను అర్జీదారుల నుండి స్వికరించారు. ఏన్కూరు మండలం అన్నారుగూడెం గ్రామంకు చెందిన మట్టా వెంకటేశ్వర్లు వికలాంగుల పెన్షన్ మంజూరు చేయగలరని సమర్పించిన దరఖాస్తును జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శాఖకు తగు చర్య నిమిత్తం ఆదేశించారు. రఘునాథపాలెం మండలం కోటపాడు గ్రామానికి చెందిన బి.రమణ భర్త చనిపోయి మూడు సంవత్సరాలైనా వితంతు పెన్షన్ మంజూరు కాలేదని, సమర్పించిన దరఖాస్తును జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ తగు చర్య నిమిత్తం ఆదేశించారు.
ఎర్రుపాలెం మండలం ఎర్రుపాలెంకు చెందిన షేక్ జిలానికు గుండె ఆపరేషన్ అయిందని ఇద్దరు కుమార్తెలు ఉన్నారని ఆసరా ఇప్పించగలరని కోరిన దరఖాస్తును సంబంధిత డిఆర్‌డిఓకు తగు చర్యల నిమిత్తం ఆదేశించారు. ఖమ్మం అర్బన్ మండలం పాండురంగాపురంకు చెందిన యలమందల ధనలక్ష్మి డబుల్ బెడ్రూం కోసం చేసిన దరఖాస్తును ఖమ్మం అర్బన్ తహశీల్దారుకు తగు చర్య నిమిత్తం ఆదేశించనైనది. తిరుమలాయపాలెం మండలం తిరుమలాయపాలెంకు చెందిన దిరిశాల జ్యోతి తనకు ఇల్లు లేదని అద్దే ఇంట్లో ఉంటున్నానని డబుల్ బెడ్రూమ్ ఇప్పించగలరని కోరిన దరఖాస్తును తహశీల్దార్ తిరుమలాయపాలెంకు తగు చర్య నిమిత్తం ఆదేశించనైనది.
కొణిజర్ల మండలం లాలాపురం గ్రామానికి చెందిన కొమ్ము భద్రయ్య మొక్కజొన్న పంట నష్టం పరిహారం ఇంకా రాలేదని చేసిన దరఖాస్తును జెడిఏ తగు చర్య నిమిత్తం ఆదేశించనైనది. ముదిగొండ మండలం వనంవారి కిష్టాపురానికి చెందిన నెల్లూరి జానకి రామయ్య మొక్కజొన్న పంట నష్టం ఐదెకరాలకు రాలేదని చేసిన దరఖాస్తును సంబంధిత వ్యవసాయ శాఖ అధికారికి తగు చర్యల నిమిత్తం ఆదేశించమైనది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ రాధికా గుప్తా, జిల్లా రెవెన్యూ అధికారి శిరిష సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.