Saturday, November 16, 2024

మహా నీరాజనం..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: మహోజ్వల భారత్ ఆవిష్కరణే లక్ష్యంగా బిఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యాచరణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా పార్టీ అధినేత కెసిఆర్ మహారాష్ట్ర పర్యటనను చేపట్టారు. రెండు రోజుల పాట సాగనున్న ఈ పర్యటనలో భాగంగా సోమవారం మహారాష్ట్రలోని ధారాశివ్, సోలాపూర్ జిల్లాల్లో సిఎం పర్యటించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మహారాష్ట్ర పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం సోలాపూర్‌కు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన కోసం ప్రగతి భవన్ నుంచి సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో రెండు ప్రత్యేక బస్సులు, భారీ కార్ల కాన్వాయోతో సిఎం బయలుదేరి వెళ్లారు. రోడ్డు మార్గాన రెండు ప్రత్యేక బస్సులు,

600 కార్లతో బయలుదేరిన ఈ కాన్వాయ్ 6 కిలోమీటర్ల మేర సిఎం వెంట కొనసాగింది. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌కు హోంమంత్రి మహమూద్ అలీ దట్టీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రహదారులు కొత్త శోభను సంతరించుకు న్నాయి. ముంబై రహదారి మీదుగా ప్రయాణిస్తున్న సిఎం కాన్వాయ్‌కు రహదారి పొడుగునా పూలు చల్లుతూ, గులాబీ కాగితాలు వెదజల్లుతూ, జై తెలంగాణ, జై కెసిఆర్, జై భారత్ నినాదాలతో టిఆర్‌ఎస్ శ్రేణులు, సిఎం కెసిఆర్ అభిమానులు ఘన స్వాగతం పలికారు.చంద్రశేఖర్ రావుకు స్వాగతం, దేశ్ కి నేత కైసే హో కెసిఆర్ జై సా హో (దేశ నాయకుడు ఎలా ఉండాలి, కెసిఆర్ లా ఉండాలి) అంటూ మహారాష్ట్ర బిఆర్‌ఎస్ నాయకులు ఫ్లెక్సీలను ప్రదర్శించారు.ధారాశివ్‌లో కెసిఆర్‌కు హారతినిచ్చిన మహిళలు ధారాశివ్ కు చేరుకున్న సిఎం కెసిఆర్‌కు అక్కడి స్థానిక నాయకులు, మహిళలు సంప్రదాయ రీతిలో హారతినిచ్చి, స్వాగతం పలికారు.

అనంతరం సిఎం కెసిఆర్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి మధ్యాహ్న భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత సిఎం కెసిఆర్ సోలాపూర్ కు బయలుదేరారు. ఆ సమయంలో జోరువాన కురుస్తున్నా లెక్కచేయకుండా సిఎం కాన్వాయ్ ముందుకు సాగింది. సిఎం కెసిఆర్ సోలాపూర్‌కు చేరుకోగానే ముఖ్యమంత్రికి బిఆర్‌ఎస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు.కెసిఆర్‌పై అక్కడి నాయకులు గులాబీ పూల వర్షం కురిపించారు. కెసిఆర్‌ను చూసేందుకు ప్రజలు భారీగా గుమిగూడడంతో పాటు మొబైల్ లతో ఫొటోలు తీసుకున్నారు. కెసిఆర్‌తో చేయి కలిపేందుకు ప్రజలు, నాయకులు దూసుకొచ్చారు. సిఎం కెసిఆర్ రాకను స్వాగతిస్తూ డప్పు, దరువులతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. స్థానిక నేతలు భారీ గజమాలతో కెసిఆర్‌ను సత్కరించారు. ‘దేశ్ కి నేత కెసిఆర్’ నినాదాలతో హోరెత్తించారు. ‘అబ్‌కి బార్ కిసాన్ సర్కార్’ నినాదాలు మిన్నంటాయి. సోలాపూర్ ప్రజల అపూర్వ స్వాగతం మధ్య సిఎం కెసిఆర్ బాలాజీ సరోవర్ హోటల్‌కు చేరుకొని కాసేపు సేదతీరారు.

బిఆర్‌ఎస్ నాయకుడు ధర్మన్న ముండయ్య ఇంటికి కెసిఆర్
అనంతరం సిఎం కెసిఆర్ హోటల్ నుంచి బిఆర్‌ఎస్ నాయకుడు ధర్మన్న ముండయ్య సాదుల్ ఆహ్వానం మేరకు సోలాపూర్ భావనారుషి పేట్ లోని వారి ఇంటికి వెళ్లి ఆతిథ్యాన్ని స్వీకరించారు. ధర్మన్న సాదుల్ ఒక పర్యాయం మేయర్‌గా, రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ తరఫున సోలాపూర్ నియోజకవర్గ ఎంపిగా సేవలు అందించారు. ఈ సందర్భంగా ధర్మన్న సాదుల్ తన కుటుంబ సభ్యులను సిఎం కెసిఆర్‌కు పరిచయం చేశారు. కెసిఆర్ ధర్మన్న సాదుల్ తో సమకాలీన రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం సిఎం కెసిఆర్ రాత్రి బస నిమిత్తం బాలాజీ సరోవర్ హోటల్ కు తిరిగి చేరుకున్నారు.

దారి పొడవునా కెసిఆర్‌కు నీరాజనాలు పలికిన స్థానికులు
ధర్మన్న సాదుల్ గృహానికి చేరుకున్న ముఖ్యమంత్రికి అక్కడే స్థిరపడిన తెలంగాణ ప్రజలు దారి పొడవునా తెలుగులో మాట్లాడుకుంటూ స్వాగతం పలుకుతూ, ఆనంద హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. పద్మశాలీలు ఎక్కువగా స్థిరపడ్డ సోలాపూర్‌లోని ఈ ప్రాంతంలోనే బిఆర్‌ఎస్ నాయకుడు ధర్మన్న సాదుల్ నివాసం ఉంటుంది. ధర్మన్న సాదుల్ తెలంగాణకు చెందిన పద్మశాలి కుటుంబంలో జన్మించారు. కరీంనగర్ జిల్లా కన్నాపూర్ గ్రామ వాస్తవ్యులైన వీరి పూర్వీకులు ఉపాధి కోసం సోలాపూర్‌కు వచ్చి స్థిరపడ్డారు. ధర్మన్న సాదుల్ కాల క్రమంలో ప్రజా నాయకుడిగా పలు పదవుల్లో రాణించారు. అనంతరం బిఆర్‌ఎస్ పార్టీ ఆదర్శాలకు, విధానాలకు ఆకర్షితులై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పాలనను మహారాష్ట్ర ప్రజలకు కూడా అందించాలన్న లక్ష్యంతో ఇటీవలే సిఎం కెసిఆర్ సమక్షంలో ఆయన బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

నేడు ఉదయం 8 గంటలకు పండరీపురం
రాత్రి కెసిఆర్ సోలాపూర్‌లోనే బస చేశారు. మంగళవారం ఉదయం 8 గంటలకు సోలాపూర్ నుంచి పండరీపురంకు కెసిఆర్ చేరుకుంటారు. అక్కడ రుక్మిణీ సమేత విఠేశ్వరస్వామివారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత సోలాపూర్ జిల్లా సర్కోలి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కెసిఆర్ హాజరవుతారు. జిల్లా నేత భగీరథ్ బాల్కే సహా పలువురు నాయకులు సిఎం సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతారు. ఆ తర్వాత ధారాశివ్ జిల్లాలో కొలువుదీరిన శక్తిపీఠమైన తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. సిఎం పర్యటన నేపథ్యంలో మహారాష్ట్ర బిఆర్‌ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు.

నాడు ఢిల్లీ.. నేడు పండరీపురం….
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కెసిఆర్ ‘చలో ఢిల్లీ’ కార్యక్రమానికి పిలుపునిచ్చి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి భారీ కార్ల ర్యాలీని (మార్చి 27, 2003 తేదీన) చేపట్టి యావత్ దేశ దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుత సమయంలో నాటి చలో ఢిల్లీని తలపిస్తూ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులతో కెసిఆర్ మహారాష్ట్రలో పర్యటించేందుకు రోడ్డుమార్గాన్ని ఎంచుకోవటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ప్రస్తుతం మహారాష్ట్రలో బిఆర్‌ఎస్ పార్టీ విజృంభిస్తోంది. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్; బిఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యులు కె.కేశవ రావు, ఎంపి నామా నాగేశ్వర్ రావు, జోగినపల్లి సంతోష్‌కుమార్, ఇతర ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News