Saturday, November 23, 2024

మాదకద్రవ్యాల దయ్యం వదలదా?

- Advertisement -
- Advertisement -

30 కోట్ల రూపాయల విలువైన 3.32 కిలోల బ్లాక్ కోకైన్ అహ్మదాబాద్ విమానాశ్రయంలో స్వాధీనం, మేఘాలయలో రూ. 15 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత, కొకైన్‌తో సినీ నిర్మాత అరెస్ట్, హిందూ మహాసముద్రంలో 25,000 కోట్ల విలువైన భారీ డ్రగ్స్ స్వాధీనం… ఇటువంటి వార్తలు ఈ మధ్యన తరుచుగా వింటున్నాం. అంటే వీటి విలువ ఎంత ఉంటుందో ఇట్టే ఊహించ్చొచ్చు. ఇవ్వన్నీ అక్రమ మార్గాలలో తరలిస్తున్న మాదక ద్రవ్యాలే…! గంజాయి, నల్లమందు, కొకైన్, మార్ఫిన్, హెరాయిన్, ఎల్‌ఎస్‌డీ (లైసెర్జిక్ యాసిడ్ డైఈథాలమైడ్), బ్రౌన్‌సుగర్, ఎండిఎంఎ (మీథైల్ ఎనడయాక్సీ-మెథాంఫెటామైన్) వంటి వాటిని మాదక ద్రవ్యాలు అంటారు. ఇవి సేవించడం వలన ఆరోగ్యపరంగా యెన్నో అనర్థాలు ఉండడం వలన ప్రపంచ వ్యాప్తం గా నిషేధించారు. వీటిలో కొన్నింటిని వాసన చూడం ద్వారా, మాత్రల రూపంలో కొన్ని, ఇంజెక్షన్ మార్గంలో మరికొన్ని తీసుకుంటారు. ఎక్కువ శాతం సంపన్న వర్గాల యువత వీటిని తీసుకుంటారు.

ఎందుకంటే ఇవి అత్యంత ఖరీదైనవి. పేర్లు ఏవైనా ఇవన్నీ మెదడుపైన, కేంద్ర నాడీ వ్యవస్థపైన ఉద్దీపన కలిగించి తక్షణ ప్రభావం చూపించి కొద్దిసేపు మత్తులో తేలియాడిస్తాయి. ఈ మత్తులో వీరు ఏమి చేస్తారో వారికే తెలియదు. ఇవి సేవించి వాహనాలు నడిపితే ప్రమాదానికి గురవుతారు. వారితో పాటుగా ఎదురుగా వస్తున్న వాహనాలకు గానీ లేదా పాదాచారులకి కూడా ప్రమాదం కలిగించవచ్చు. మత్తులో అత్యాచారాలు చెయ్యడానికి వెనుకాడరు. మొదట్లో సరదాగా తీసుకున్న వారు కొంత మందైతే, కుటుంబ సంబంధ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఒంటరితనం వలన ఇంకొంత మంది తీసుకుంటారు. కొద్ది మంది జన్యుపరమైన సమస్యలు వలన కూడా వీటికి అలవాటుపడతారు. కొన్ని రోజుల తరువాత ఇవి లేకపోతే జీవించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆత్మహత్యలు చేసుకొంటారు. ఇంకో కోణంలో విశ్లేషిస్తే ఇవి చాలా ఖరీదు.కొనడానికి తగినంత సొమ్ములు లేకపోవడం వలన ఇంట్లో దొంగతనానికి పాల్పడతారు లేదా ఇతర అరాచక పనులు చేసే వీలుంది.

రౌడీలుగా, గూండాలుగా మారే అవకాశం ఉంది. ఊపిరితిత్తులు, కాలేయం, గుండె, మెదడు పనితీరులో మార్పు వస్తుంది. జ్ఞాపకశక్తి కోల్పోతాడు, చేసే పని మీద ఏకాగ్రత కోల్పోయే ప్రమాదం ఉంది. ఐక్యరాజ్యసమితి విభాగం ఈ మధ్యన వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ (ప్రపంచ మాదక ద్రవ్యాల నివేదిక ) 2022ని విడుదల చేసింది. దీనిలో నివేదించిన వివరాల ప్రకారం పెద్దల కంటే యువకులే ఎక్కువ వాడుతున్నారు.గత కొన్ని సంవత్సరాలుగా వీటిని వినియోగించే యువకుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. స్త్రీల కంటే పురుషులే ఎక్కువ తీసుకొంటున్నా, కొన్ని రకాల మాదకద్రవ్యాల వినియోగంలో స్త్రీలసంఖ్య ఎక్కువగా ఉండడం గమనార్హం. ఓపియాయిడ్స్, కొకైన్, గంజాయి తీసుకుంటున్న వారిలో పురుషుల వాటా వరుసగా 85 %, 73 %, 70 % ఉండగా మిగిలిన వాటా స్త్రీలు తీసుకుంటున్నారు. 2020 లో ప్రపంచ వ్యాప్తంగా 15- 64 ఏళ్ల వయసు గల 284 మిలియన్ల మంది డ్రగ్స్‌ను ఉపయోగించారు,

ఇది గత దశాబ్దంలో 26% పెరిగింది. యువత ఎక్కువగా డ్రగ్స్ వాడుతున్నారు. చాలా దేశాల్లో మునుపటి తరాలతో పోలిస్తే వినియోగ స్థాయి ఎక్కువగా ఉంది. అంతర్జాతీయ గణాంకాలు సాధారణంగా నాలుగు రకాల అక్రమ మాదక ద్రవ్యాల సమూహాలపై దృష్టి పెడతాయి: ఓపియాయిడ్లు, కొకైన్, యాంఫేటమిన్లు, గంజాయి. 2020 సం॥లో మొత్తం జనాభాలో 4 % (209 మిలియన్లు) మంది గంజాయిని, 1.2% (61 మిలియన్లు) ఓపియాయిడ్లను , 0.4 % (21.5మిలియన్లు) కొకైన్‌ని, 0.7% (34 మిలియన్లు) ఎటియస్ డ్రగ్‌ని తీసుకున్నట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికలో భారత దేశంలో ఎంత మంది వీటికి లోనవుతున్నారో పొందుపరచపోయినప్పటికీ 2020వ సంవత్సరంలో 5.2 టన్నుల ఓపియం, 0.7 టన్నుల మార్ఫీన్‌ని మన దేశానికి అక్రమంగా తరలిస్తున్నవారి నుండి అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఇంకా 3.8 టన్నుల హెరాయిన్‌ని సీజ్ చేసినట్లు పేర్కొంది. భారతదేశంలో మాదకద్రవ్యాల దుర్వినియోగం , అక్రమ రవాణా తీవ్రమైన సవాలును ఎదుర్కొంటోంది. ఇది మిలియన్ల మంది ప్రజల ఆరోగ్యం, శ్రేయసు, భద్రతను ప్రభావితం చేస్తుంది.

దీనికి కారణం భారత దేశం రెండు ప్రధాన మాదకద్రవ్యాలను ఉత్పత్తి చేసే ప్రాంతాలైన గోల్డెన్ క్రెసెంట్(ఇరాన్, -అఫ్ఘానిస్తాన్, -పాకిస్థాన్), గోల్డెన్ ట్రయాంగిల్ (థాయ్‌లాండ్-, లావోస్-, మయన్మార్) మధ్య ఉంది.అయితే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ప్రకారం గత మూడు సంవత్సరాలలో నల్లమందు, గంజా యి సాగు విస్తీర్ణంలో 89,000 ఫుట్‌బాల్ మైదానాల పరిమాణంలో నాశనం చేయబడింది. ఇవి అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, త్రిపురలో ఉన్నాయి. కోటి రూపాయలకు పైగా విలువైన 6.7 లక్షల కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌సిబి తెలిపింది. గడిచిన మూడేళ్లలో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌లో రూ. 3000 కోట్ల హెరాయిన్, ఓపియం, గంజాయి, కొకైన్, మెథాంఫెటమైన్, ఎండిఎంఎ (ఎక్టసీ), కెటామైన్ మొదలైనవి ఉన్నాయి. ఈ మధ్య ఢిల్లీలో జరిగిన మాదక ద్రవ్యాల వ్యాప్తి నిరోధకానికి రాష్ట్ర, కేంద్రపాలిత స్థాయిలో టాస్క్‌ఫోర్స్ అధిపతుల మొదటి సమావేశంలో హోం అమిత్ షా 2047 సం.

నాటికి మాదకద్రవ్యరహిత దేశంగా భారత్ ఉండబోతుందని తెలిపారు.సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ యువత, మహిళలో మాదకద్రవ్యాలు దుర్వినియోగాన్ని నిరోధించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తుంది. అందులో భాగంగా జాతీయ కార్యాచరణ ప్రణాళిక, ఎన్ ఎపిడిడిఆర్ పథకం కింద యువత, మహిళల్లో మాదకద్రవ్యాల దుర్వినియోగ సమస్యను అరికట్టడానికి నిరంతర సమన్వయ చర్యలు తీసుకుంటుంది. మాదకద్రవ్యాల బాధితులకు చికిత్స అందించడమే కాకుండా, నివారణ కొరకు అవగాహన పెంపొందించడం, వ్యసనం నుండి బయట పడేందుకు పునరావాస కేంద్రాలు, డి- అడిక్షన్ కేంద్రాలు నెలకొల్పింది. అలాగే యువతలో మాదకద్రవ్యాల దుర్వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలు గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో నషా ముక్త్ భారత్ అభియాన్‌ని 272 జిల్లాలలో ప్రారంభించింది.

అలాగే డి అడిక్షన్ కోసం టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 14446 ద్వారా సహాయం కోరే వ్యక్తులకు కౌన్సిలింగ్, తక్షణ సహాయం అందించుతుంది. అంతేకాకుండా మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తున్నవారిని ఉక్కుపాదంతో అణచివేస్తుంది. ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం అత్యంత ఆవశ్యకం. కేవలం ప్రభుత్వాలు మాత్రమే ఈ మాదకద్రవ్యాల తీసుకొనే అలవాటు నుండి తప్పించలేవు. బాధ్యత గల పౌరులుగా ప్రజలందరూ సహకరించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News