Monday, November 25, 2024

అది అక్రమార్కుల ఫొటోసెషన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీని ఉమ్మడిగా ఎదుర్కొనేలా వ్యూహాలు రచించేందుకు బీహార్ రాజధాని పాట్నాలో ఇటీవల ప్రతిపక్షాల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంపై ప్రధాని మోడీ తొలిసారిగా స్పందిస్తూ ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అది కేవలం ఫోటో సెషన్ అంటూ ఎద్దేవా చేశారు. ఆ సమావేశంలో పాల్గొన్న పార్టీలన్నీ కొన్నిల క్షల కోట్ల రూపాయల విలువైన కుంభకోణాలకు పాల్పడ్డాయని దుయ్యబట్టారు.‘ ఈ మధ్య కాలంలో ‘హామీ’అనే పదాన్ని పదేపదే వింటున్నాం.

ఈ పార్టీలన్నీ( విపక్షాలు) అవినీతి, కోట్ల రూపాయల కుంభకోణాలకు హామీలిచ్చినవే. కొన్ని రోజుల క్రితం వారంతా ఓ ఫొటో సెషన్ నిర్వహించారు. ఆ ఫొటోలో ఉన్న వాళ్లంతా రూ.20 లక్షలకోట్ల విలువైన కుంభకోణాలకు హామీలిచ్చారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఒక్కటే లక్షల కోట్ల విలువైన కుంభకోణాలకు పాల్పడింది. ఈ పార్టీలనిటికీ స్కామ్‌లు చేసిన అనుభవం మాత్రమే ఉంది. వారంతా ఇచ్చే హామీ ఒక్కటే .. కుంభకోణం. ఇలాంటి హామీలను అంగీకరించాలా వద్దా అనేది నిర్ణయించాల్సింది దేశ ప్రజలే. ఇక మోడీ హామీ ఏమిటంటే ప్రతి అవినీతిపరుడిపైనా చర్య తప్పదు’ అని ప్రధాని విపక్షాలపై మండిపడ్డారు.

ఇక వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీని ఓడించడానికి ఉమ్మడి పోరుకు దిగాలన్న ప్రతిపక్షాల తీర్మానంపైనా మోడీ విమర్శలు గుప్పించారు. ‘ ఇప్పటివరకు ఒకరినొకరు దూషించుకున్న వ్యక్తులు ఇప్పడు ఒకరి కాళ్లపై మరొకరు పడుతున్నారు. అది వాళ్ల నిస్సహాయతకు నిదర్శనం. అలాంటాటి వారిపై కోపం వద్దు జాలి మాత్రమే చూపించాలి’ అని పార్టీ కార్యకర్తలతో ప్రధాని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News