ముంబై: ప్రపంచంలోని 150 అత్యుత్తమ యూనివర్సిటీలలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటి) బాంబే చోటు దక్కించుకుంది. బ్రిటన్‌కు చెందిన క్వాక్వారెల్లి సైమండ్స్ తాజాగా ప్రకటించిన వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ఐఐటి బాంబే 149వ స్థానంలో నిలిచింది.
గత ఏడాది 172వ ర్యాంకులో ఉన్న ఐఐటి బాంబే ఈ ఏడాది ప్రపంచ ర్యాంకింగ్‌లో 149వ స్థానానికి చేరుకున్నట్లు అధికారులు బుధవారం వెల్లడించారు. 100కు 51.7 స్కోరుతో మొట్టమొదటిసారి ఐఐటి బాంబే టాప్ 150 యూనివర్సిటీలలో స్థానం సంపాదించింది.
ప్రపంచంలోని ఉత్తమమైన 1,500 యూనవర్సిటీలలోని టాప్ 10వ శాతంలో ఐఐటి బాంబే నిలిచినట్లు అధికారులు చెప్పారు. గడచిన 8 సంవత్సరాలలో టాప్ 150 యూనివర్సిటీలలో ఒక భారతీయ ఉన్నత విద్యా సంస్థ చోటు దక్కించుకోవడం ఇదే ప్రథమం. 2016లో చివరిసారి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్‌స్‌సి) 147వ స్థానంలో నిలిచింది.
కాగా..2024 ర్యాంకింగ్స్‌లో ఐఐఎస్‌సి బెంగళూరు 155 నుంచి 225కి పడిపోయింది. కాగా ఐఐటి ఢిల్లీ ర్యాంకు 174 నుంచి 197కి పడిపోగా ఐఐటి కాన్పూర్ 264 నుంచి 278కి పడిపోయింది. ఐఐటి మద్రాసు ర్యాంకు 250 నుంచి 285కి దిగజారగా ఐఐటి గువాహటి ర్యాంకు స్వల్పంగా మెరుగుపడుతూ 384 నుంచి 369కి చేరుకుంది. మొత్తం 9 పారామీటర్లలో లభించే మార్కులను బట్టి ర్యాంకులు నిర్ణయిస్తారు. ఎంప్లాయర్ రెప్యుటేషన్, సైటేషన్ పర్ ఫ్యాకల్టీ, అకాడమిక్ రిప్యుటేషన్, ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌కమ్, సస్టయినబిలిటీ, ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో, ఇండర్నేషనల్ ఫ్యాకల్టీ, ఇంటర్నేషనల్ రిసెర్చ్ నెట్‌వర్క్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వంటి పారామీటర్ల ద్వారా మార్కులు లభిస్తాయి. మొత్తం 100 మార్కులు ఉంటాయి.