Sunday, November 24, 2024

ఉమ్మడి పౌరస్మృతికి ఆప్ ఓకే ?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు విషయం తిరిగి వేడి అందుకుంది. ఉమ్మడి పౌరస్మృతి (యుసిసి)కి తాము సూత్రప్రాయ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆమ్ ఆద్మీపార్టీ ( ఆప్ ) తెలిపింది. దీని అమలుకు ముందు సంబంధిత భాగస్వామ్య పక్షాలన్నింటి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవల్సి ఉందని ఆప్ స్పష్టం చేసింది. యుసిసిపై ఇప్పటికే కాంగ్రెస్ బిజెపి మధ్య తీవ్ర స్థాయి వ్యాగ్యుద్ధం సాగుతోంది. ఇండియన్ ముస్లిం లీగ్ (ఐయుఎంఎల్), ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఎఐఎంపిఎల్‌బి) ఈ కోడ్ పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.

భోపాల్‌లో రెండు రోజుల క్రితం ప్రధాని మోడీ ఓ సభలో మాట్లాడుతూ దేశంలో ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. దీనిపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం అయ్యాయి. ప్రతిపక్ష ఐక్యత దిశలో యత్నాల దశలో కీలక ప్రతిపక్షం అయిన ఆప్ మరో విపక్షం కాంగ్రెస్‌ను కాదంటూ కేంద్రానికి పరోక్ష మద్దతు ప్రకటించింది. ఢిల్లీతో పాటు పంజాబ్‌లో కూడా అధికారంలో ఉన్న ఆప్ కోడ్‌కు మద్దతు ప్రకటించడం కీలకం అయింది. మైనార్టీలకు ఇది చాలా ముప్పుగా మారుతుందని పంజాబ్‌లోని శిరోమణి అకాలీదళ్ నిరసన వ్యక్తం చేసింది. దీనిపై ఉద్యమిస్తామని తెలిపింది. గిరిజనుల హక్కులను కూడా హరించినట్లు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ముస్లింలు వ్యతిరేకిస్తారు..అయితే వింటారా?
జమైత్ ఉలేమా చీఫ్ మౌలానా ఆవేదన
దేశంలోని ముస్లింలు అంతా ఉమ్మడి సివిల్ కోడ్ పట్ల తమ అభిప్రాయాలు తెలియచేస్తారని, అయితే ఈ గోడును ఎవరు వింటారని జమైత్ ఉలేమా ఎ హింద్ అధినేత మౌలానా అర్షద్ మదానీ తెలిపారు. దేశంలో అతి పెద్ద ముస్లింల సంస్థగా ఈ వేదిక ఉంది. మా వైఖరిని తెలియచేస్తాం కానీ దీని వల్ల ఉపయోగం ఏముంటుంది? ఎవరైనా ఏం చేస్తారు? ప్రధాని మోడీనే బహిరంగంగా విషయం తెలిపారు. ముస్లింల మతపరమైన హక్కులను హరిస్తామని చెప్పారని ఇక ఎవరైనా ఏం చేసేదని ప్రశ్నించారు. ఇక ముస్లిం పర్సనల్ లా బోర్డు మూడు గంటల పాటు సమావేశం అయింది. తమ వైఖరిని త్వరలోనే లా కమిషన్‌కు తెలియచేస్తామని లాబోర్డు నిర్వాహకులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News