సహరాన్‌పూర్: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు జరిపిన సంఘటనపై ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు గురువారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సహరాన్‌పూర్ జిల్లాలోని దేవ్‌బంద్ ప్రాంతంలో ఆజాద్‌పై బుధవారం దాడి జరిగింది. కాల్పుల సంఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆజాద్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.
ఆజాద్ సమాజ్ పార్టీ నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ సహచరులు ఇచ్చిన ఫిర్యాదుపై దేవ్‌బంద్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దాడికి పాల్పడిన వారిపై హత్యా యత్నం అభియోగాలతోపాటు ఎస్‌సి, ఎస్‌టి చట్టాల కింద ఎఫ్‌ఐఆర్‌లో నేరారోపణలు పేర్కొన్నారు.
ఉత్తర్ ప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లాలో బుధవారం సాయుధ వ్యక్తులు కొందరు ఆజాద్ కాన్వాయ్‌పై దాడి చేశారు. కాగా..దుండగులు జరిపిన కాల్పులలో గాయపడిన ఆజాద్ శాంతిని పాటించాలని తన మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు. ఈ ఆకస్మిక దాడిని తాను ఊహించలేదని ఆసుపత్రిలో ఆయన విలేకరులకు తెలిపారు. తన తముడు కూడా తనతోపాటే కారులో ఉన్నట్లు ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న తన మద్దతుదారులు, స్నేహితులు, పార్టీ కార్యకర్తలకు శాంతిని పాటించాలని ఆజాద్ పిలుపునిచ్చారు. రాజ్యాంగబద్ధంగా తమ పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు.
ఆసుపత్రిలో ఆజాద్‌ను కలసి మాట్లాడానని సహరాన్‌పూర్ ఎస్‌పి అభిమన్యు మంగ్లిక్ తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, కాల్పులకు పాల్పడిన నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని ఆయన తెలిపారు. ఆజాద్ పొట్టను రాసుకుంటూ బుల్లెట్ వెళ్లిందని, ఆయన పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉందని ఎస్‌పి చెప్పారు.