బాన్సువాడ: బాన్సువాడ డివిజన్‌లో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముందుగా బక్రీద్ పర్వదినాన్ని పురస్క రించుకుని ఉదయమే నూతన వస్త్రాలను ధరించి చిన్నా పెద్దలు అందరూ కలిసి గ్రామాల పొలిమేరల్లోని ఈద్గాల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
బాన్సువాడ పట్టణంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనల అనంతరం రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముస్లిం సోదరులకు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా ఇస్లాం మతస్తులు జరుపుకునే పవిత్ర పండుగ (ఈద్ ఉల్ అజ్ హా) అని అన్నారు. భక్తిని, త్యాగ గుణాన్ని బక్రీద్ పండుగ చాటి చెబుతుందన్నారు. తమకు కలిగిన దాంట్లో నుంచే ఇతరులకు పంచి పెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదనే స్పూర్తిని బక్రీద్ పండుగ కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, నాయకులు మహ్మద్ ఎజాజ్, అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.