అచ్చంపేట ః త్యాగానికి ప్రతిరూపంగా ముస్లిం సోదరులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి భక్తిశ్రద్ధలతో కుర్బానీ రూపంలో పండుగ వేడుకలు ఘనంగా జరుపుకుంటారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. గురువారం అచ్చంపేట పట్టణంలోని క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న ఈద్గా వద్ద ముస్లిం సోదరులు నూతన వస్త్రాలు ధరించి జామే మస్జీద్ సదర్ సిద్ధిఖ్ ఆధ్వర్యంలో ఇమాముల సమక్షంలో భారీగా ర్యాలీ చేపట్టి ఈద్గా ప్రాంగణానికి చేరుకుని ఈదుల్ అజా నమాజ్ గావించారు. అనంతరం ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ బక్రీద్ పండుగ ప్రాణ త్యాగానికి ప్రతీకగా నిలిచాయని వాటి యొక్క విశిష్టతలను క్షుణ్ణంగా ముస్లిం సోదరులకు వివరించారు.
ప్రతి ఒక్కరు సమాజంలో ఈర్ష, ద్వేషాలు విడనాడి ప్రేమ అనురాగంతో ప్రవక్త చూపించిన సన్మార్గంలో ప్రజలు నడవాలని ముస్లిం సోదరులకు సూచించారు. అంతకుముందు ముస్లిం కమిటీ తరపున స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్‌కు, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణకు, ఎంపి రాములుకు వివిధ పార్టీల నాయకులకు బక్రీద్ పండుగ సందర్భంగా ఈదుల్ అజా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ బక్రీద్ పండుగను ముస్లింలు త్యాగానికి ప్రతీకగా కుర్బాని ఇచ్చి పండుగను ఘనంగా జరుపుకుంటారని అన్నారు. ఈద్గా వద్ద చేరుకుని ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుంటూ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలపడం ద్వారా ఎంతో మనశ్శాంతి లభిస్తుందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముస్లింల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, అందులో భాగంగానే పేదింటి ఆడపిల్లలకు షాది ముబారక్‌తో పాటు ముస్లిం మైనార్టీలకు కళాశాలలు, పాఠశాలలు ఏర్పాటు చేసి చేయూతనిస్తుందని, ముస్లింల సంక్షేమానికి సిఎం కెసిఆర్ పెద్దపీట వేశారని ఆయన గుర్తు చేశారు. అచ్చంపేట పట్టణాన్ని అన్ని మౌళిక వసతులతో పాటు అభివృద్ధి పరిచి అచ్చంపేట పట్టణాన్ని మాడల్ పట్టణంగా తీర్చిదిద్ధడమే తమ ఏకైక లక్షమని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో చైర్మెన్ ఎడ్మ నర్సింహా గౌడ్, సీనియర్ నాయకులు పోకల మనోహర్, రాజేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్ సుంకరి నిర్మల బాలరాజు, కాంగ్రెస్ నాయకులు రాజేందర్, మాజీ ఎంపిపి రామనాథం గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.