కరకగూడెం : మైనార్టీల అభ్యున్నతికి సిఎం కెసిఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. గురువారం కరకగూడెం మండల కేంద్రంలోని జామా మసీదు నందు బక్రీద్ పండగ పురస్కరించుకొని జరిగిన ప్రత్యేక ప్రార్ధనల్లో రేగా కాంతారావు హాజరై ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో మైనారిటీల సంక్షేమానికి సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని, ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని అన్నారు.
ముస్లిం ఆడపిల్లలకు సిఎం కెసిఆర్ అండగా నిలిచేలా షాది ముబారక్ పథకం ద్వారా లక్ష 116 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నారని, దేశం లో ఎక్కడ ఇలాంటి పథకం లేదని చెప్పారు. అంతేకాకుండా విద్య కోసం పెద్దపీఠ వేశారని మైనార్టీ పాఠశాలను ఏర్పాటు చేసి వారి చదువుకు భరోసా అందిస్తున్నారని తెలిపారు. దేశంలో మైనారిటీ పాఠశాలల ఏర్పాటు చేసి పాటుపడుతూ తెలంగాణ మోడల్‌గా నిలిచిందని ఇటీవల ఒక నివేదిక కూడా తెలిపినట్లు ఆయన తెలిపారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ పండగ జరుపుకుంటున్నారని తెలిపారు.
భక్తి భావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సాంకేతమైన ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అల్లా ఆశీస్సులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతాంగం ప్రజలందరికీ ఎల్లప్పుడు సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని అభిలాషించారు. అల్లా దయతో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.