భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు పట్టాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు సిద్ధమైనట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. గురువారం పాల్వంచ మండలంలోని సుగుణా గార్డెన్స్‌లో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 30న పోడు పట్టాలు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు, జిల్లాకు చెందిన పార్లమెంట్, శాసనమండలి, శాసనసభ్యులు హాజరవుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గానికి 500 చొప్పున మొత్తం 2500 మంది లబ్ధిదారులకు శుక్రవారం పోడు పట్టాలు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.
జిల్లా మొత్తం 50595మంది లబ్ధిదారులకు పోడు పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అన్ని నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల నుంచి లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. పట్టాలు తీసుకున్న లబ్ధిదారులను మొబలైజ్ చేయాలని, ఆయా గ్రామాలకు సంబంధించిన సర్పంచులు, ఎంపిటిసిలు, జడ్పీటీసిలు, ఎంపీపీలు, కార్యదర్శులు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని జెడ్పి సిఇఒకు సూచించారు. ప్రాంగణాన్ని సుందరంగా ముస్తాబు చేయాలని ఉద్యాన అధికారికి సూచించారు. పట్టాల జారీలో క్రమ పద్దత పాటించాలని, రద్దీ లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. హాల్లో ఎల్ఈడి టీవీలు ఏర్పాటు చేయాలని చెప్పారు.
పోడు పట్టాల పంపిణీ కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. లబ్ధిదారులు క్యూ పాటించేందుకు వీలుగా బారికేడింగ్ ఏర్పాటుతో పాటు నియోజకవర్గాల వారీగా మండలాల కౌంటర్లు, సైనేజీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతీ నియోజకవర్గంలో పట్టాలు తీసుకోనున్న లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని ఎంపిడివోలను ఆదేశించారు. భోజనాల వద్ద రద్దీ నియంత్రణకు పట్టిష్ట చర్యలు చేపట్టాలని చెప్పారు. ఐడివోసి కార్యాలయంలో హెలికాప్టర్ ఏర్పాటు చేయాలని రోడ్డు భవనాల అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్డీవో మధుసుదన్రాజు, ఉద్యాన అధికారి జినుగు మరియన్న, జడ్పీ సీఈవో విద్యాలత, డిపివో రమాకాంత్, డిసివో వెంకటేశ్వర్లు, మైనార్టీ సంక్షేమ అధికారి సంజీవరావు, ఆర్అండ్బి డిఈ నాగేశ్వరరావు, మునిసిపల్ కమీషనర్ శ్రీకాంత్, డిఆర్వో అశోక్ చక్రవర్తి ఏవో గన్యా, పాల్వంచ తహసీల్ధార్ రంగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.