హైదరాబాద్: తొమ్మిదేళ్లలో మీరు చూసింది ట్రైలరే అని.. అసలు సినిమా ముందు ఉందని, తొందరపడకండని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. హైదరాబాద్ జర్నీ ఇప్పుడే మొదలైందని, కెసిఆర్ మనసులో ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయని ఆయన తెలిపారు. నానక్‌రాంగూడలోని క్రెడాయ్ కార్యాలయాన్ని మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జానపద గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్‌కు కెటిఆర్ నివాళులర్పించారు. అనంతరం మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ 95 నుంచి 100 స్థానాల్లో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
60 ఏళ్లలో కానీ పనులు తొమ్మిదేళ్లలో పూర్తి
మాటలు చెప్పడం ఈజీనే కానీ, తొమ్మిదేళ్లలో ఎక్కడ ఉన్న తెలంగాణ ఎక్కడకు వచ్చిందో ఆత్మావలోకనం చేసుకోవాలని మంత్రి కెటిఆర్ అన్నారు. మాటలు చెబుతున్న ఓ ప్రతిపక్ష పార్టీయేమో 50 ఏళ్లు అధికారం చలాయించిన వాళ్లేనని ఇంకో ప్రతిపక్షమేమో ఢిల్లీలో 9 ఏళ్లుగా పాలిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. వాళ్ల మాటలేమో కోటలు దాటుతాయి, కానీ, కాళ్లు మాత్రం కడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. కరెంట్ సమస్య పరిష్కారం అలకటి పని అయితే 50, 60 ఏళ్లుగా ఎందుకు పరిష్కారం కాలేదని కెటిఆర్ ప్రశ్నించారు. త్రాగునీటి, సాగునీటి సమస్యలు అలకటి పనే అయితే ఎందుకు పరిష్కారం కాలేదని కెటిఆర్ ప్రశ్నించారు. 60 ఏళ్లలో కానీ పనులు తొమ్మిదేళ్లలో పూర్తికావడానికి సమర్థవంతమైన కెసిఆర్ నాయకత్వం, సుస్థిరమైన ప్రభుత్వమే కారణమని కెటిఆర్ స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికల్లో 95 నుంచి100 సీట్లు గెలుస్తాం
రాష్ట్రం ఏర్పడిన కొత్తలో చాలామంది చాలా అనుమానాలు వ్యక్తం చేశారని, తెలంగాణ వచ్చిన కొత్తలో జరిగిన ఎన్నికల్లో 63 సీట్లే వచ్చాయని, ఒక్క 10 మందిని అటు, ఇటు చేస్తే వెంటనే ప్రభుత్వం ఆగమైతదని, తెలంగాణ ఫెయిల్ ఎక్స్‌పర్‌మెంట్ అవుతదని తెలంగాణ వ్యతిరేకులు చాలా ప్రయత్నాలు చేశారని కెటిఆర్ గుర్తు చేశారు. కొంతమంది రాజకీయ నాయకులకు క్లారిటీ ఉండకపోవచ్చు, కానీ, ప్రజలకు క్లారిటీ ఉంటుందన్నారు. జేబులో 100 నోటు ఉంటే దాని కింద పడేసి రోడ్డు మీద చిల్లర నాణేలు ఎవరూ ఏరుకోరని కెటిఆర్ తెలిపారు. అలాగే మంచిగ పనిచేసే ప్రభుత్వాన్ని పిచ్చోళ్లు కూడా వదులుకోరని కెటిఆర్ పేర్కొన్నారు. కాబట్టే మొదటి ఎన్నికల్లో 63 సీట్లతో గెలిస్తే, 2018 ఎన్నికల్లో 88 సీట్లతో గెలిచామని, 2023లో జరిగే ఎన్నికల్లో 95 నుంచి 100 స్థానాల్లో గెలుస్తామని సంపూర్ణ విశ్వాసం ఉందని కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు.
చూమంతర్ అనంగానే అభివృద్ధి జరగలేదు
‘డోంట్ టేక్ థింగ్స్ సో గ్రాంటెడ్’ అని తేలిగ్గా తీసుకోవద్దని ప్రజలకు మంత్రి కెటిఆర్ సూచించారు. అంతా బాగుంటుంది, ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, ఎవరున్నా ఎట్లే ఉంటది అని అనుకోవడం తప్పని కెటిఆర్ హితవు పలికారు. 2014 కంటే ముందు పరిస్థితి బాగోలేదని, ఎందుకు కరెంట్ బాగోలేదు, ఎందుకు త్రాగునీరు బాగోలేదు, ఎందుకు సాగు నీరు బాగోలేదు, ఎందుకు మార్కెట్ బాగోలేదు, ఇప్పుడెందుకు బాగైంది, ఉత్తగనే అనామతుగా అయిపోయిందా? ఉత్తగనే చూమంతర్ అనంగానే కూర్చొని టైమ్‌పాస్ చేస్తుండగానే పనులు అయినయా? అని కెటిఆర్ ప్రశ్నించారు.
బయటకు పోయి మళ్లీ వస్తేనే మన కథ అర్థమైతది
గచ్చిబౌలి, కొండాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోని పెద్ద బిల్డింగ్‌లను చూసి ఇది హైదరాబాదా? న్యూయార్క్ నగరమా అని అనిపించిందని సూపర్‌స్టార్ రజనీకాంత్ చెప్పారని మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. రజనీకాంత్ ఉండేది మనకంటే పెద్ద నగరమైన చెన్నైలో, ఆయన సూపర్ స్టార్, వంద దేశాలు తిరిగి ఉంటండు. మరి ఆయనకు హైదరాబాద్‌ను చూస్తే అలా అనిపించింది. ఆయన ఒక్కడికే కాదు, ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసేందుకు ఫాక్స్‌కాన్ చైర్మన్ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయన ఇది ఇండియానేనా అని ఆశ్చర్యపోయారన్నారు.
వేరే ఏదో దేశంలో ఉన్నామని అనుకున్నట్లు చెప్పారని కెటిఆర్ అన్నారు. హైదరాబాద్, తెలంగాణలో ఉన్నోళ్లకే ఇక్కడి పరిస్థితి అర్థం కావడం లేదని మంత్రి కెటిఆర్ తెలిపారు. వాళ్లు ఒక్కడుగు బయటకు పోయి మళ్లీ వస్తేనే మన కథేంటో అర్థమైతదని ఆయన అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రకో, కర్ణాటకకో గుజరాత్‌కో, ఇంకో రాష్ట్రానికో వెళ్లి అక్కడ పది రోజులు ఉండొస్తే మన రాష్ట్రం గొప్పదనం అర్థమవుతుందని కెటిఆర్ పేర్కొన్నారు. ఇంటి కోడి పప్పుతో సమానం అన్నట్టుగా మన సత్తా, మన ప్రభుత్వ పనితీరు ఇక్కడి వాళ్లకు అర్థం కావడం లేదని కెటిఆర్ తెలిపారు.
కెసిఆర్ పాలనలో ఆ రెండూ ఉన్నాయి..
ఇదేదో ఎన్నికల్లో లాభం కోసం చెప్పడం లేదని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. చంద్రబాబు ఉన్నప్పుడు ప్రొ ఐటీ, ప్రొ బిజినెస్ టైప్‌లో పాలన ఉండేదని మంత్రి కెటిఆర్ అన్నారు. సిఎం కాదు, సీఈఓ అంటే ఆయనకు నచ్చేదని కెటిఆర్ గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డికి ప్రొ ఫార్మర్, ప్రొ పూర్, ప్రొ రూరల్ ఇమేజ్ ఉండేదన్నారు. కానీ కెసిఆర్ పాలనలో ఆ రెండూ ఉన్నాయని, అదే కెసిఆర్ ప్రభుత్వం ప్రత్యేకత అని కెటిఆర్ తెలిపారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కానీ, స్టార్టప్ ఎకో సిస్టం ఉన్న వనరులు కానీ, ఏదీ చూసుకున్నా నేడు హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని మంత్రి కెటిఆర్ అన్నారు. నగర వాసులంతా హైదరాబాద్‌ను చూసి గర్వపడే విధంగా నగరం రూపుదిద్దుకుందన్నారు. నాయకుడికి దృఢ సంకల్పం ఉంటే ప్రజలకు మంచి చేయాలని ఆలోచన ఉంటే మార్పు కచ్చితంగా వస్తుందని కెటిఆర్ అన్నారు. నిజంగా పని చేసి చూపించడం పెద్ద సవాల్ అని ఆయన పేర్కొన్నారు.
అన్ని జిల్లాలోనూ ఐటీ కంపెనీలు: క్రెడాయ్ తెలంగాణ చైర్మన్
క్రెడాయ్ తెలంగాణ చైర్మన్ సిహెచ్ రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ, 2014లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తాము వేగవంతమైన అభివృద్ధిని చూస్తున్నామన్నారరు. ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ పరిశ్రమలకు చెందిన కంపెనీలు భారతదేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పెట్టుబడి గమ్యస్థానాల్లో ఒకటిగా హైదరాబాద్‌ను నిలిపిందన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, సిద్దిపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఐటీ పార్కులను ప్రభుత్వం నిర్మించిందన్నారు. అదే విధంగా అభివృద్ధిని టైర్ 1 , టైర్ 2 పట్టణాలకి తీసుకెళ్లేందుకు అనేక పారిశ్రామిక జోన్లను ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ కార్యాలయం ఓఆర్‌ఆర్‌కు దగ్గరగా ఉండటం వల్ల జిల్లా చాప్టర్లకు సులభంగా అందుబాటులో ఉంటుందన్నారు.
మరిన్ని పారిశ్రామిక కారిడార్లకు ప్రభుత్వం శ్రీకారం: క్రెడాయ్ అధ్యక్షుడు
క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ డి. మురళీకృష్ణా రెడ్డి మాట్లాడుతూ జిల్లాలను కలుపుతూ ఏర్పాటు చేసే ప్రాంతీయ రింగ్ రోడ్డును అభివృద్ధి చేయాలన్న దృక్పథం, నిబద్ధతతో, మరిన్ని పారిశ్రామిక కారిడార్లకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోం దన్నారు. దీంతో పాటు ఎస్‌ఆర్‌డిపి జిల్లాలకు మరింతగా కనెక్టివిటీని అందిస్తోందన్నారు. ఇది రాబోయే ముందుతరాలకు వృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో సాయపడుతుందన్నారు. జిల్లాలోని రియల్టీ రంగం నిర్మాణాత్మక వృద్ధికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
అన్ని జిల్లాలోనూ గణనీయమైన అభివృద్ధి: ఇ.ప్రేంసాగర్ రెడ్డి
క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ -ఎలెక్ట్ అయిన ఇ.ప్రేంసాగర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి వికేంద్రీకరణ కారణంగా వరంగత్‌తో సహా వివిధ జిల్లాల్లో గణనీయమైన అభివృద్ధిని చూస్తున్నామన్నారు. ఉపాధి అవకాశాలను సృష్టించడం, సంపదను పెంపొందించడం అనే ఈ విధానం రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో మేలు చేసిందన్నారు. బహుళ కేంద్రాల్లో వృద్ధిని విస్తరించడంలో ప్రభుత్వం చేస్తున్న కృషికి తాము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. దీనివల్ల వలసలను నియంత్రించవచ్చన్నారు.
రియల్‌ఎస్టేట్ అభివృద్ధికి చర్యలు: కె. ఇంద్రసేనారెడ్డి
క్రెడాయ్ తెలంగాణ కార్యదర్శి కె. ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ స్థాయి రియల్ ఎస్టేట్ అభివృద్ధి చేసే సభ్యులకు మద్ధతు ఇవ్వడానికి క్రెడాయ్ తెలంగాణ కట్టుబడి ఉందన్నారు. రియల్ ఎస్టేట్ పరిశ్రమ యొక్క సామర్థ్యాన్ని, ప్రభావాన్ని మెరుగుపరచడానికి తాము చర్యలు తీసుకుంటామన్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లోని కొత్త కార్యాలయం నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాల కోసం ఆధునిక సౌకర్యాలను అందించామన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి వి. ప్రశాంత్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు జి.రంజిత్‌రెడ్డి, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే డి.సుధీర్‌రెడ్డితో పాటు సిఐఐ తెలంగాణ చైర్మన్,
క్రెడాయ్ నేషనల్ మాజీ అధ్యక్షుడు సి.శేఖర్‌రెడ్డి, క్రెడాయ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్, క్రెడాయ్ తెలంగాణ మాజీ చైర్మన్ జి.రాంరెడ్డి, సిహెచ్ రాంచంద్రారెడ్డి, క్రెడాయ్ తెలంగాణ చైర్మన్, డి. మురళీ కృష్ణా రెడ్డి, అధ్యక్షుడు, ఇ. ప్రేంసాగర్ రెడ్డి, ప్రెసిడెంట్ – ఎలెక్ట్, కె. ఇంద్రసేనారెడ్డి, సెక్రటరీ, జి. అజయ్‌కుమార్, జగన్ మోహన్ చిన్నాల, వి. మధుసూధన్ రెడ్డి, బి. పాండురంగా రెడ్డి, ఉపాధ్యక్షులు, జి. శ్రీనివాస్ గౌడ్, సంయుక్త కార్యదర్శులు ఎం. ప్రశాంత్ రావు కోశాధికారి, క్రెడాయ్ యూత్ వింగ్ తెలంగాణ, సి. సంకీర్త్, ఆదిత్య రెడ్డి, కో ఆర్డినేటర్ రోహిత్, అశ్రిత్ తదితరులు పాల్గొన్నారు.