షాద్‌నగర్: ఉత్తరాఖండ్ వంటి శీతల ప్రాంతల్లో, హిమాలయాల్లో మాత్రమే వికసించే ఆరుదైన బ్రహ్మకమలం పుష్పాలు షాద్‌నగర్ పట్టణంలో వికసించాయి. షాద్‌నగర్ పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు మానవపాటి విజయరత్న, విమల ద్వితీయ పుత్రుడు మానవపాటి ప్రదీప్‌కుమార్ ఇంట్లో గురువారం రాత్రి బ్రహ్మకమలం పుష్పాలు వికసించాయి. బ్రహ్మకమలం వికసించిన ప్రాంతమంతా సువాసన వెదజల్లుతుంది.
నాలుగు సంవత్సరాల క్రితం నాటిన బ్రహ్మకమలం మొక్క ఇప్పటికి ఐదుసార్లు పుష్పాలు వికసించాయి. ఈ సంవత్సరంలో రెండుసార్లు పుష్పాలను వికసించిందని యాజమాని ప్రదీప్‌కుమార్ తెలిపారు. పరమ పవిత్రమైన బ్రహ్మకమలం పుష్పాలు వికసించడంతో ఇంటి యాజమానితోపాటు కాలనీవాసులు పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందూ పురాణాల ప్రకారం వికసించిన బ్రహ్మకమలంపై బ్రహ్మదేవుడు ఆశీనులై ఉంటారని వేద పండితులు చెబుతారు. బ్రహ్మకమలం పుష్పాలు మాములుగా హిమాలయాల్లో విరివిగా ఉంటాయని, మన ప్రాంతాల్లో చాలా అరుదుగా ఉన్నాయని పేర్కొన్నారు.
హైందవ పురాణాల్లో ఈ పుష్పానికి చాలా విశిష్టతలు ఉంటాయని, పరమశివుడిని బ్రహ్మకమలం పుష్పంతో పూజిస్తే కోరుకున్న కోరికలు తీరుతాయని పలువురు భక్తులు తెలిపారు. ఏడాదికి ఒకసారి మాత్రమే వికసించే ఈ అరుదైన పుష్పాలు కొన్ని గంటలు మాత్రమే వికసించి ఉంటాయని పేర్కొన్నారు.