నాగర్‌కర్నూల్ ః నాగర్‌కర్నూల్ జిల్లాలో జులై 1వ తేదిన నిర్వహించే గ్రూప్ 4 పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. శుక్రవారం ఉదయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గ్రూప్ 4 నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జూమ్ మీటింగ్ నిర్వహించగా జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ నాగర్‌కర్నూల్ జిల్లాలో గ్రూప్ 4 పరీక్షకు 16 వేల 632 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని, పరీక్షలు సజావుగా నిర్వహిచేందుకు అన్ని సదుపాయాలతో కూడిన 50 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్షను పకడ్భందీగా నిర్వహించేందుకు అనుభవఙ్ఞులైన చీఫ్ సూపరిండెంట్‌లు, లైజన్ ఆఫీసర్లు, రూట్ అధికారులను నియమించుకోవడం జరిగిందన్నారు.
ఇన్విజిలేటర్లకు పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చి నియమ నిబంధనలపై అవగాహన కల్పించడం జరిగింది. ఉదయం 10 గంటలకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రెండవ పేపర్ పరీక్ష ప్రారంభమవుతుందని, దీని కోసం ఉదయం పరీక్షకు అభ్యర్థులను ఉదయం 8.30 నుంచి 9.45 గంటల వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుందన్నారు. తర్వాత ఒక్క నిమిషం ఆలస్యం చేసినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం జరగదన్నారు. మధ్యాహ్నం పరీక్షకు 1.30 నుంచి 2.15 వరకు అనుమతించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు వారికి కేటాయించిన పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోవాలని సూచించారు. ఎవరైనా అభ్యర్థులకు హాల్ టికెట్‌పై ఫోటో కనిపించని పక్షంలో 3 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలపై గెజిటెడ్ అధికారి సంతకం చేయించుకుని తీసుకెళ్లాలన్నారు. ప్రతి అభ్యర్థి తన హాల్ టికెట్‌తో పాటు అదనంగా ఒక గుర్తింపు కార్డును విధిగా వెంట తీసుకెళ్లాలని తెలిపారు.
దివ్యాంగులు పరీక్ష స్వయంగా రాయలేని వారి కోసం పరీక్ష కేంద్రంలోనే సహాయకులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వారి వెంట మరొకరిని తీసుకురావాల్సిన అవసరం లేదన్నారు. గ్రూప్ 4 పరీక్షకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ 08546 230201కు ఫోన్ చేయాలని తెలిపారు. పరీక్షలకు పకడ్భందీగా నిర్వహించేందుకు ప్రతి పరీక్ష కేంద్రంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. పరీక్ష కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు 144 సెక్షన్ అమలు, జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచే విధంగా చర్యల తీసుకోవడం జరిగిందన్నారు. అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా ప్రత్యేక రూట్లలో బస్‌లు నడిపసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు.