Saturday, December 21, 2024

టికెట్‌ల కోసం కాంగ్రెస్‌లో పెరుగుతున్న బిసిల డిమాండ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు మాత్రం కచ్చితంగా టికెట్ మాత్రం తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న బిసి నాయకులకు 50 శాతం టికెట్‌లు ఇవ్వాలని బిసి వర్గాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 2014లో పొన్నాల లక్ష్మయ్య పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 31 మంది బిసి అభ్యర్థులకు టికెట్‌లు ఇచ్చారని ఆ తరువాత వచ్చిన ఎన్నికల్లో బిసిలకు మరిన్ని సీట్లు తగ్గిపోయాయని, ఈసారి మాత్రం 50 శాతం టికెట్‌లకు తక్కువ కాకుండా ఇస్తేనే అభ్యర్థుల గెలుపునకు తామంతా కృషి చేస్తామని కాంగ్రెస్‌లోని బిసి నాయకులు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. అవసరమైతే రాహుల్‌గాంధీని సైతం కలిసి తమ ప్రతిపాదనను ఆయన ముందు ఉంచుతామని వారు పేర్కొంటున్నారు.

2018లో 25 సీట్లకే పరిమితం
2018లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బిసిలకు 25, ఓసిలకు 41, ఎస్సీలకు 17, ఎస్టీలకు 10, మైనార్టీలకు 07 సీట్లు ఇచ్చారు. దీంతోపాటు కొందరికి చివరి నిమిషంలో టికెట్ ఇవ్వడం వల్ల వారు ఓడిపోయారు. ఈసారి అలాకాకుండా ముందుగా అభ్యర్థులను ఖరారు చేయాలని ఆశావహులు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ సీట్లను బిసిలకు ఇవ్వాలని ఆయా వర్గాలు అభ్యర్థిస్తున్నాయి.

అధికారమే ధ్యేయంగా అభ్యర్థుల ఎంపిక
అయితే బిసిల ప్రతిపాదన ఇలా ఉంటే అధిష్టానం మాత్రం జన, ధన బలం కలిగిన నాయకుల కోసం వేట ప్రారంభించింది. జనాభా ప్రాతిపదికన కాకపోయినా కొంచెం అటు ఇటుగా అభ్యర్థుల ఎంపిక ఉండేటట్లు ముందుకు వెళ్లాలని టిపిసిసి నిర్ణయించింది. అధికారమే ధ్యేయంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న పిసిసి జన, ధనబలం కలిగిన నాయకుల కోసం ఆరా తీస్తోంది.

సామాజిక వర్గాల వారీగా బలమైన అభ్యర్థుల కోసం…
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ముందే అభ్యర్థులను ప్రకటిస్తామన్న కాంగ్రెస్ సామాజిక వర్గాల వారీగా బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తోంది. సామాజిక వర్గాల వారీగా బిసిలు 48 శాతం, జనరల్ 23 శాతం, ఎస్సీలు 17, ఎస్టీలు 11 శాతం లెక్కన జనాభా ఉంది. ఎస్సీలకు 18, ఎస్టీలకు 9 లెక్కన మొత్తం 27 రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తులు పెట్టుకోగా అందులో 19 స్థానాలను పొత్తులు పెట్టుకున్న పార్టీలకు కాంగ్రెస్ కేటాయిం చింది. మిగిలిన వందలో ఓసీలకు 41, బిసిలకు 25, ఎస్సీలకు 17, ఎస్టీలకు 10, మైనారిటీలకు 7 లెక్కన అసెంబ్లీ సీట్లను కేటాయించారు.

చాలాచోట్ల బిసి అభ్యర్థులు బలహీనంగా…
కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ జోష్‌లోకి వచ్చింది. ఆ పార్టీలో చేరేందుకు పలువురు నాయకులు ఆసక్తి చూపిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్న అభ్యర్ధులను పరిశీలించిన పిసిసి చాలాచోట్ల బిసి అభ్యర్థులు బలహీనంగా ఉన్నట్లు అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే జన, ధన,బలం కలిగిన నాయకుల కోసం అన్వేషణ చేపట్టింది. అయితే దాదాపు 50 శాతం జనాభా కలిగిన బిసిలకు ఆ స్థాయిలోనే సీట్లు కేటాయించాలని బిసి నాయకులు డిమాండ్ చేయడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News