Friday, November 22, 2024

ప్రత్యేక రాష్ట్రానికి గుర్తుగా పోస్టల్ కవర్ ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -
బౌద్ధ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఉందని కిషన్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్ : తెలంగాణ ఏర్పడి 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకమైన పోస్టల్ కవర్‌ను విడుదలతో పాటు నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రాంతంలోని బావాపూర్ కురు గ్రామంలో బౌద్ధ సంప్రదాయాన్ని గుర్తుచేసుకుంటూ ఓ పోస్టు కార్డును ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన అబిడ్స్‌లోని డాక్ సదన్, చీప్ పోస్ట్‌మాస్టర్ కార్యాలయంలో ప్రత్యేక పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించారు.

ఈసందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో బౌద్ధ సంప్రదాయాన్ని ప్రతిబింబించే 5వ శతాబ్దం నాటి ప్రాంతాలను గుర్తుచేసుకోవడం దీన్ని ఓ పోస్టు కార్డు ఆవిష్కరణ ద్వారా మరోసారి మన సమాజానికి గుర్తుచేసే ఈ ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా పోస్టల్ శాఖ ద్వారా ఇలాంటి ప్రయత్నాలు ఇకపైనా కొనసాగాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును గుర్తుచేసుకుంటూ పోస్టల్ కవర్‌ను విడుదల చేసుకోవడం అభినందనీయమని తెలిపారు. ఇందుకోసం ఈ సర్కిల్‌లో 2 పోస్టల్ రీజియన్లు, 17 పోస్టల్ డివిజన్లు, 2 ఆర్‌ఎంఎస్ డివిజన్లు 6,208 పోస్టాఫీసుల ద్వారా మారుమూల ప్రాంతాల వరకు కూడా పోస్టల్ సేవలు అందుతాయని వెల్లడించారు.

మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పోస్టల్ వ్యవస్థ రూపురేఖలు మారిపోయాని, మొదట్లో పోస్టాఫీసులంటే లెటర్లు, టెలిగ్రాములు అందించేందుకే అనే అభిప్రాయం ఉండేదన్నారు. ప్రస్తుతం మారుమూల ప్రాంతాల్లో సామాన్యులకు విస్తృతమైన సేవలు అందించే దిశగా ప్రయత్నం జరిగిందన్నారు. 2014లో కేంద్రంలో మోదీ అధికారం చేపట్టిన తరువాత రాష్ట్రంలోని 5,796 పోస్టాఫీసులను ఆధునీకరించి రూ. 7,489 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. దీంతోపాటుగా ఈ వ్యవస్థలో ఉన్నతమైన పదవులనుంచి క్షేత్రస్థాయిలో పనిచేసే వారి వరకు ఉద్యోగాల కల్పనపై దృష్టిపెట్టినట్లు దీని ద్వారా ప్రస్తుతం తెలంగాణలో పోస్టల్ శాఖలో దాదాపు 17వేల మంది ప్రజలకు సేవలందిస్తున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని 16 పోస్టాఫీసుల్లో పాస్‌పోర్టు సేవలు అందుబాటులో ఉన్నాయని, 266 పోస్టాఫీసుల్లో ఆధార్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని, వినియోగదారుల సేవలను 3,571 పోస్టాఫీసుల్లో అందిస్తున్నట్లు దీని ద్వారా ప్రజల్లో మళ్లీ పోస్టాఫీసు సేవలపై విశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు. ఎందుకంటే మారుమూల ప్రాంతాల వరకు ఏదైనా ప్రభుత్వ వ్యవస్థ చేరుకోగలదంటే అందులో మొదటి స్థానం పోస్టల్ శాఖదేనన్నారు. అందుకే వీటిని బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు అందించే సేవలను మరింత విస్తృతం చేయాలనేది మోదీ సర్కారు సంకల్పమన్నారు. ప్రజల్లో విశ్వాసం పెరిగిన కారణంగా ఇండియా పోస్ట్ పేమెంట్స్’ బ్యాంకు అకౌంట్ల పెరిగినట్లు చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో 33 లక్షల ‘ఇండియా పోస్ట్ పేమెంట్స్’ బ్యాంకు అకౌంట్లు ఉన్నాయన్నారు. బ్యాంకులు లేని చోట సేవింగ్స్ విషయంలో, ఇతర లావాదేవీల విషయంలో పోస్టాఫీసులు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. తెలంగాణ పోస్టాఫీసుల ద్వారా 258 సేవలు అందుబాటులో ఉన్నాయని, ఇందులో 159 సేవలు.. పోస్ట్‌మెన్‌లు, గ్రామీణ డాక్ సేవక్‌లు.. వినియోగదారుల ఇళ్ల వద్దకే వెళ్లి అందిస్తున్నారు.

33 సేవలు ఆన్‌లైన్ ద్వారా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. సుకన్య సమృద్ధి యోజన,మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ ద్వారా రెండేళ్ల సమయానికి 7.5 శాతం వడ్డీకి రుణాలు ఇవ్వడం ద్వారా దాదాపు 50వేల మంది మహిళలకు ప్రయోజనం జరిగిందన్నారు. ఇప్పటివకు జరిగిన 5 రోజ్‌గార్ మేళాల ద్వారా తెలంగాణలోనే 435 పోస్టులు పోస్టాఫీసు శాఖలో భర్తీ చేసినట్లు చెప్పారు. నేడు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుంది అది మోదీ న్యాయకత్వానికి నిదర్శనమని, భారత్ అభివృద్ధి లో మీ సహకారం ఉద్యోగస్తుల సహకారం అమోఘమని, తెలంగాణ లో సైతం అద్భుతమైన జాతీయరహదారుల నిర్మాణం జరిగిందన్నారు. ప్రతిష్టాత్మకమైన ట్రిబుల్ ఆర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం దానికి సమాంతరంగా ఔటర్ రైల్ రింగ్ ప్రాజెక్ట్ కు ఆమోదం లభించిందని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News