Saturday, November 23, 2024

ఫ్రాన్స్‌లో టీన్‌టెన్షన్..

- Advertisement -
- Advertisement -

నాంటెర్రె : ఫ్రాన్స్‌లో నల్లజాతి టీనేజర్ నాహేల్‌ను పోలీసులు చంపేసిన ఘటన తీవ్ర స్థాయి నిరసనలు, హింసాకాండకు దారితీసింది. వరుసగా మూడోరోజు రాత్రి కూడా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో హింసాత్మక ప్రదర్శనలు జరిగాయి. నిరసనకారులు జరిపిన విధ్వంసకాండ, చెలరేగిన ఘర్షణలతో 249 మంది పోలీసులు గాయపడ్డారు. నిరసనకారులు రోడ్లపై బారికేడ్లు పెట్టారు. మంటలు రగిలించారు. పోలీసులతో తలపడ్డారు, వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. పలు చోట్ల నిరసనకారులు కార్లను తగులబెట్టారు.భద్రతా బలగాలపైకి నిరసనకారులు పలు చోట్ల బాణాసంచా కాల్పి విసిరారు పలు చోట్ల దుకాణాలను దోచుకున్నారు.

బస్సు డిపోలను తగులబెట్టారు. ఓ చోట పోలీసు స్టేషన్‌పై దాడి జరిగింది. ఫ్రాన్స్ అధ్యక్షులు ఎమ్మాన్యుయెల్ మెక్రాన్ తమ బ్రస్సెల్స్ పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని తిరిగి దేశానికి పయనం అయ్యారు. ఆయన సంక్షోభ నివారణకు ఉన్నత స్థాయి సంప్రదింపులు చేపట్టనున్నారు. తమ తోటి టీనేజర్‌ను పోలీసులు దారుణంగా చంపివేయడం పట్ల దేశంలోని యువత అత్యధిక సంఖ్యలో రోడ్లపైకివచ్చి విరుచుకుపడుతోంది. దీనితో వీరి దూకుడును తట్టుకోవడం పోలీసులకు గగనం అవుతోంది. గురువారం రాత్రి నిరసనలు, విధ్వంసకాండకు దిగి అరెస్టు అయిన వారిలో అత్యధికులు కేవలం 14 నుంచి 18 ఏండ్లలోపు వారే ఉన్నారు.

40వేల మంది పోలీసు , భద్రతా అధికారులు రంగంలోకి
దేశవ్యాప్తంగా అల్లర్లను అణచివేసేందుకు ఇప్పటికే 40,000 మంది అధికారులను రంగంలోకి దింపినట్లు స్థానిక అంతర్గత వ్యవహారాల మంత్రి గెరాల్డ్ దర్మానిన్ తెలిపారు. మెరుపు దాడుల దళాలు, జిఐజిఎన్ యూనిట్ల అధికారులను సునిశిత ప్రాంతాలకు తరలించినట్లు వారి పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే దళాలతో ఘర్షణలను నివారించేందుకు యత్నిస్తున్నట్లు గెరాల్డ్ తెలిపారు. నిరసనకారులు పలు చోట్ల విధ్వంసానికి పాల్పడుతున్నారు. భారీ భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ విధ్వంసం సాగుతోంది. హింసాకాండ, ఆస్తులు తగులబెట్టడం, వాహనాల ధ్వంసం జరుగుతోంది.
ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు
యువ నిరసనకారులు ఎక్కువగా ప్రభుత్వ కార్యాలయాలను లక్షంగా చేసుకుని దాడులకు దిగుతున్నారు. మున్సిపల్ కార్యాలయాల భవనాలు, టౌన్‌హాల్స్, లైబ్రరీలు ఎక్కువగా మర్సెయిల్లే , సియినీ సైయింట్ డెనిస్ విభాగాలు ఉండే పారిస్ నార్త్ ప్రాంతంలో దాడికి గురయ్యాయి. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కాల్పులు పేలుళ్ల చప్పుళ్లు , గందరగోళం నెలకొంది. తూర్పు ప్రాంత నగరం అయిన లయన్‌లో ఓ ట్రామ్‌కు నిప్పంటించారు.

ఇక దేశవ్యాప్తంగా అర్బన్ హింసాకాండ?
రాబోయే రోజులలో రాత్రుల్లో దేశంలో పట్టణ ప్రాంతాలలో హింసాకాండ వాతావరణం నెలకొంటుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. అధికారిక చిహ్నాలుగా ఉండే ప్రాంతాలు, ఎక్కువగా ప్రభుత్వ కార్యాలయాలపై దాడులకు దిగాలని నిరసనకారులు యోచిస్తున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలకు సమాచారం అందిందని ఎఎఫ్‌పి వార్తా సంస్థ తెలిపింది. ప్రస్తుతం బ్రస్సెల్స్‌లో యూరోపియన్ యూనియన్ భేటీకి వెళ్లిన ఫ్రాన్స్ అధ్యక్షులు పరిస్థితి నిశితంగా పరిశీలిస్తున్నారు.
17 సంవత్సరాల నాహేల్ హత్య అందులోనూ పోలీసులు ఈ యువకుడిని చంపివేశారని తెలియడం దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది.పారిస్‌లోని సబర్బన్ వెస్ట్ ప్రాంతంలో ఈ టీనేజర్‌ను పోలీసులు చంపివేసినట్లు అభియోగాలు ఉన్నాయి. దేశంలో చాలా కాలంగా పోలీసు జులుం సాగుతోంది. ఓ పద్ధతి ప్రకారం తెగల వివక్ష ఏకంగా శాంతిభద్రతల పరిరక్షణ సంస్థలలోనే నెలకొందనే విషయం ఆందోళన కల్గిస్తోంది. ఇప్పుడు జరిగిన టీనేజర్ అంతంతో ఇది మరింతగా భగ్గుమంది.
కొడుకు ప్రాణం తీశాడు: నాహేల్ తల్లి ఆవేదన
కొడుకు హత్య ఏ విధంగా జరిగిందో తనకు పూర్తిగా తెలియదని, తాను పోలీసులను నిందించదల్చుకోలేదని, అయితే ఓ వ్యక్తి తన కొడుకు ప్రాణాలను తీశాడని నహెల్ తల్లి మౌనియా ఫ్రాన్స్ 5 టీవీకి ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. తన కొడుకు ప్రాణాలు తీసింది 38 సంవత్సరాల అధికారి అని ఆమె ఆరోపించారు. మంగళవారం రాత్రి ఆ అధికారి దారుణంగా వ్యవహరించాడని, తన కొడుకును తనకు దూరం చేశాడని తెలిపారు. తన కొడుకు కారులో వెళ్లుతుండగా తనిఖీలకు ఆపుతున్న దశలో ఈ అధికారి కాల్చివేసినట్లు తెలిపారు. తన కొడుకు అరబ్ లాగా ఉండటం వల్లనే చంపిఉంటాడని ఆరోపించారు. తనకు పూర్తిస్థాయి న్యాయం దక్కాల్సి ఉందన్నారు.

పోలీసు అధికారి కానీ ఏ ఇతరులు కానీ మా పిల్లలపై గన్‌తో దాడికి దిగి ప్రాణాలు తీసే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. కాగా నాహేల్ నానమ్మ ఓ అల్జీరియా టీవీ ఎన్నాహర్ టీవీ ఛానల్‌తో మాట్లాడారు. తమ కుటుంబ పూర్వపు మూలాలు అల్జీరియాతో ఉన్నాయని, ఫ్రాన్స్‌లో ఉన్నామని తెలిపారు. తమ దేశ సంతతి మూలాలున్న టీనేజర్ అంతం పట్ల అల్జీరియాలో విషాదం నెలకొంది. తమ దేశ ప్రజలంతా సంఘీభావం వ్యక్తం చేశారని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. పోలీసులు తరచూ వర్ణవివక్షతకు దిగుతున్నారని, ఇతర తెగలపై జులుం సాగిస్తున్నారని పలు ఫిర్యాదులు అందాయి. యాంటి రేసిజమ్ ఉద్యమకారులు ఇప్పుడు తీవ్రస్థాయిలో నిరసనలకు దిగారు.

బ్లాక్‌లు, అరబ్ వారిని కాల్చేస్తున్నారు
శాంతిభద్రతల విధులలో ఉండే పోలీసులు తమకు ఎక్కడ నల్లజాతీయులు, అరబ్‌లు కన్పించినా సహించలేని స్థితిలో ఉన్నారు. కొందరిని పట్టుకుని కొడుతున్నారు. ఏకంగా వేరే మాటలు లేకుండా వారి తలకు గన్‌పెట్టి కాల్చేస్తున్నారని ఆరోపణలు తీవ్రతరం అయ్యాయి. వారిని ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. బతకడానికి వచ్చి ఫోజులా అంటూ యువతను గేలిచేస్తున్నారని ఇతర దేశాల మూలాలు ఉన్న వారు తెలిపారు. అమెరికాతో పోలిస్తే ఫ్రాన్స్‌లో మారణాయుధాల వాడకం తక్కువే. సామూహిక కాల్పులు వధల ఘటనలు ఎక్కువగా ఉండవు. అయితే గత ఏడాది ట్రాఫిక్ నిబంధనలను పాటించలేదని , సిగ్నల్స్ వద్ద ఆపలేదని పేర్కొంటూ ఫ్రెంచ్ పోలీసులు 13 మందిని కాల్చివేశారు.

వీరిలో ఎక్కువ మంది నల్లజాతీయులు ఉండటం పోలీసులలో నెలకొన్న జాతి తెగల విద్వేషానికి ప్రతీక అని విమర్శలు తలెత్తాయి. అమెరికాలోని మిన్సెసోటాలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ను శ్వేతజాతి పోలీసు అధికారి దారుణరీతిలో బూటుకాలితో తొక్కి ప్రాణాలు తీసిన ఘటన తరువాత వెలువడ్డ నిరసనలు స్థాయిలోనే ఇప్పుడు ఫ్రాన్స్‌లో వాతావరణం నెలకొంది. హింసాత్మక ఘటనలతో పారిస్‌లో బస్సులు, ట్రామ్ సర్వీసులను నిలిపివేశారు. ఫ్రాన్స్ పరిణామాల ప్రభావం చివరికి బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో కూడా సెగలకు దారితీసింది. ఫ్రాన్స్ ఘటనకు నిరసనగా జరిగిన ప్రదర్శనలు, ఘర్షణలతో పరిస్థితిని అదుపులో పెట్టేందుకు పోలీసులు పలు రౌండ్ల కాల్పులకు దిగాల్సి వచ్చింది. ఫ్రాన్స్ అధ్యక్షులు బ్రస్సెల్స్ పర్యటనకు వచ్చిన దశలో ఈ ఘటనలు జరిగాయి.
ఆపేందుకు యత్నించి కాల్పులు

నాహేల్ ఘటనపై పారిస్ పోలీసులు
యువకుడి మరణంపై విచారణ సాగుతోంది. పోలీసులు పద్ధతి ప్రకారమే వ్యవహరించారని ప్రాసిక్యూటర్ ప్రచే తెలిపారు. టీనేజర్ అయిన నహెల్ మెర్సిడెస్ కారు నడిపిస్తూ కన్పించాడని, బస్సులు వెళ్లే దారిలో దూసుకువెళ్లడంతో నిలిపివేసేందుకు పోలీసులు యత్నించారని వివరించారు. అయితే ఆగకుండా రెడ్‌లైట్ దాటేసి వెళ్లడంతో ఆపేందుకు ఇద్దరు అధికారులు గన్స్ తీసి బెదిరించారని చెప్పారు. యువకుడిని ఆపేందుకే కాల్పులు జరిపినట్లు , ఈ క్రమంలో ఆయన చనిపోయినట్లు వివరించారు.
2005లో కూడా ఇదే తరహా ఘటన …హింసాకాండ
ఇప్పుడు ఫ్రాన్స్ పట్టణ ప్రాంతాలలో నెలకొన్న హింసాకాండ 2005లో జరిగిన ఘటనలను పోలి ఉంది. అప్పట్లో పోలీసులను చూసి జడుసుకుని సిల్చి సౌస్ బోయిస్‌లోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లోకి చొరబడ్డ ఇద్దరు టీజేజర్లు బౌనా ట్రాఓరే, జయెద్ బెన్నాలు అక్కడ కరెంటు షాక్‌తో సజీవ దహనం చెందడంతో మూడు వారాల పాటు ఘర్షణలకు దారితీశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News