న్యూఢిల్లీ : కేంద్రం వెలువరించిన సర్వీసెస్ ఆర్డినెన్స్‌ను ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టులో సవాలుచేసింది. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌తో ఢిల్లీ బ్యూరోక్రాట్ల నియామకాలు, బదిలీల అధికారం అంతా కేంద్రం గుప్పిట్లో ఉంటుంది. అయితే సదరు ఆర్డినెన్స్ రాజ్యాంగ వ్యతిరేకం అని పేర్కొంటూ ఆప్ ప్రభుత్వం పిటిషన్ వేసింది. ఉద్యోగుల సంబంధిత విషయంపై కేంద్రం అధికారం అనుచిత జోక్యం కిందికి వస్తుందని తెలిపిన ఆప్ ప్రభుత్వం దీనిని కొట్టివేయాలని అప్పటిలోగా స్టే ఇవ్వాలని కోరింది. అత్యున్నత న్యాయస్థానం ఇంతకు ముందు సంబంధిత విషయంలో వెలువరించిన ఆదేశాలకు భంగంగా ఇప్పటి ఆర్డినెన్స్ ఉందని ,
రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి తూట్లు పొడుస్తుందని ఆప్ తరఫున సుప్రీంకోర్టులో అర్జీ దాఖలు అయింది. మే 11వ తేదీన ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సారధ్యపు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. ఇందులో కార్యనిర్వాహక బాధ్యతల అధికారాలు, సంబంధిత ప్రక్రియ సాగేందుకు అధికారుల నియామకాలు, సేవల నిర్వహణ అంతా కూడా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందని తెలిపింది. అయితే ఇందుకు భిన్నమైన విధంగా ఇప్పటి ఆర్డినెన్స్‌ను కేంద్రం తీసుకురావడంపై ఆప్ ప్రభుత్వం సుప్రీం శరణు జొచ్చింది.