సిటీబ్యూరో: కమిషనరేట్ ఫరిధిలో జరిగే బోనాల పండుగకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ ఆదేశించారు. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో శుక్రవారం పోలీస్ అధికారులతో కలిసి నిర్వహించిన సమావేశంలో బోనాల పండుగ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో త్వరలో జరగబోయే బోనాల పండుగకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని అన్నారు. అలాగే క్రైం రివ్యు సమావేశం కూడా నిర్వహించారు.
ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌ హాన్ బోనాల పండగ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సం ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజల సహకారంతో బోనాలు ప్రశాంతంగా ముగిసేలా చూడాలని అన్నారు. సున్నితమైన ప్రాంతాలలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, సమర్థవంతమైన సిబ్బందిని బందోబస్తులో ఉంచాలని అన్నారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనే సామూహిక వేడుకల వంటి కార్యక్రమాల బందోబస్తు సమయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో బోనాల వేడుకల సమయంలో ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ప్రజలు శాంతియుతంగా, సంతోషంగా బోనాల పండుగ జరుపుకోవాలని, తమ చర్యల ద్వారా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులతో సహకరించాలని కోరారు. బందోబస్తు ఏర్పాట్లు చేసే సందర్భంలో తగిన సమర్థవంతమైన అధికారులకు విధులు అప్పగించాలని సూచించారు. ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, ఆయా ప్రాంతాల్లో సీసీటీవీల పనితీరును పరిశీలిస్తూ ఉండాలని అన్నారు. మహిళల పట్ల ఎవరూ అసభ్యకరంగా ప్రవర్తించకుండా, ఎలాంటి వేధింపులకు గురికాకుండా షి టీమ్స్ బృందాలు ఎల్లవేళలా విధుల్లో ఉండాలని ఆదేశించారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో మత సామరస్యం కాపాడడానికి అవసరమైన అన్ని రకాల చర్యలూ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నిర్వహించిన క్రైం రివ్యు సమావేశంలో, అన్ని జోన్లలో నేరాల శాతం తగ్గింపు కోసం చర్యలు చేపట్టాలని, పాత నేరస్తుల మీద నిఘా ఉంచాలని, వారు ఎటువంటి నేరాలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్రమం తప్పకుండా వాహనాల నంబర్ ప్లేట్లు తనిఖీ చేయాలని, పత్రాలను పరిశీలించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో రాచకొండ జాయింట్ సీపీ సత్యనారాయణ, డిసిపి అభిషేక్ మొహంతి , డిసిపి జానకి, డిసిపి రాజేష్ చంద్ర, డిసిపి గిరిధర్, డిసిపి అనురాధ, డిసిపి బాలస్వామి, డిసిపి సాయి శ్రీ, డిసిపి శ్రీ బాల, డిసిపి శ్రీనివాస్, డిసిపి మురళీధర్, డిసిపి అడ్మిన్ ఇందిర, డీసీపీ అడ్మిన్ నర్మద, అదనపు డీసీపీ షమీర్, అదనపు డీసీపీ శ్రీనివాస్, అదనపు డీసీపీ లక్ష్మి, ఏసిపిలు, ఇన్స్పెక్టర్లు, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.